E-Paper
Advertisement

హైదరాబాద్‌లోని ఈ 3 రెస్టారెంట్‌లు యమ డేంజర్.. మరీ ఇంత దారుణమా?

హైదరాబాద్‌లోని ఈ 3 రెస్టారెంట్‌లు యమ డేంజర్.. మరీ ఇంత దారుణమా?
Advertisement

Food Safety: హైదరాబాద్ నగరం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి నోరూరించే బిర్యానీ, ఘుమఘుమలాడే వంటకాలు. అయితే, మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహారం వెనుక ఎంతటి ఘోరం దాగి ఉందో తాజాగా వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నగరంలోనే మోస్ట్ పాపులర్ అయిన మూడు పెద్ద ఆహారశాలలు అత్యంత అపరిశుభ్రంగా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించి అధికారులు షాక్‌కు గురయ్యారు. ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుతున్న సదరు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, తక్షణమే మార్పులు చేసుకోవాలని హెచ్చరించారు.

పాలమూరు గ్రిల్‌లో గడువు ముగిసిన ఆహారం!
కొండపూర్ ఆర్‌టీఓ (RTO) కార్యాలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ ‘పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్’ లో అధికారులు తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇక్కడ తయారుచేసిన ఆహార పదార్థాలపై ఉండే లేబుళ్లను మార్చేసి (తారుమారు చేసి), పాత వంటకాలనే కొత్తవాటిగా కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు గుర్తించారు. వంటగదిలో పాడైపోయిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన పుట్టగొడుగులు (Mushrooms) లభించడంతో అధికారులు వాటిని వెంటనే పారవేయించారు. అంతేకాకుండా, ఫ్రీజర్లు తుప్పు పట్టి, నీరు నిలిచిపోయి, ఈగలు ముసురుతూ ఈ హోటల్ వంటగది ఒక నరకంలా తలపించింది. గిన్నెలు కడగడానికి కనీసం వేడినీటి సదుపాయం కూడా లేకపోవడం ఇక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది.

Advertisement

మెహఫిల్ వంటగదిలో ‘రూమాలి రోటీ’ దారుణం..
హైటెక్ సిటీ లాంటి ఐటీ హబ్‌లో ఐటీ ఉద్యోగులతో నిరంతరం కిటకిటలాడే ‘మెహఫిల్ రెస్టారెంట్’ లో సైతం ఆహార భద్రతా నిబంధనలు గాలికి కొట్టుకుపోయాయి. ఇక్కడి వంటగది చాలా ఇరుకుగా ఉండటమే కాకుండా, నేలంతా జిడ్డుగా, తడిగా మారిపోయి ఈగలకు నిలయంగా మారింది. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమిటంటే.. పక్కనే భవన నిర్మాణం (Construction) జరుగుతూ దుమ్ము, ధూళి కొట్టుకొస్తున్న ప్రాంతంలో ఎలాంటి మూత లేకుండా ‘రూమాలి రోటీలు’ తయారు చేస్తున్నారు. దీనిని చూసిన అధికారులు వెంటనే ఆ తయారీని నిలిపివేయించారు. కనీసం అక్కడ పనిచేసే సిబ్బందికి ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు (వైద్య ధృవీకరణ పత్రాలు) కూడా లేకపోవడం గమనార్హం.

గోడలపై గుట్కా మరకలు.. పక్కనే మాంసం కోతలు!
ఇక గచ్చిబౌలి-రాయ్‌దుర్గ్ రోడ్డులో ఉండే ఫేమస్ ‘షా ఘౌస్ బిర్యానీ రెస్టారెంట్’ లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కస్టమర్ల నుంచి వందల రూపాయలు వసూలు చేసే ఈ హోటల్ వంటగది గోడలపై సిబ్బంది నమిలి ఉమ్మేసిన గుట్కా మరకలు దర్శనమిచ్చాయి. మాంసం కట్ చేసే ప్రదేశాలు అత్యంత అపరిశుభ్రంగా, కంపు కొడుతూ ఉన్నాయి. వంటగదికి ఆనుకునే తెరిచి ఉన్న మురుగు కాలువలు, పేరుకుపోయిన కుళ్లిన ఆహార వ్యర్థాలు, లీకేజీ అవుతున్న స్టోర్‌రూమ్‌లు చూసి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పరిశుభ్రత పాటించకుండా ఇక్కడ బిర్యానీలు తయారుచేసి ప్రజల పొట్టలు కొడుతున్నారని తనిఖీల్లో తేలింది.

Advertisement

కఠిన చర్యలకు అధికారులు సిద్ధం..
ఈ మూడు ప్రముఖ రెస్టారెంట్లలో జరిగిన ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా స్పందించారు. వీరికి మెరుగుదల నోటీసులు (Improvement Notices) జారీ చేస్తూ, ఇచ్చిన గడువులోగా వంటగదులను శుభ్రం చేసుకోకపోతే హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. బ్రాండ్ల పేర్లు చూసి, కేవలం రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే నగర ప్రజలు.. తాము తినే ఆహారం ఎంతవరకు సురక్షితమైనదో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై కూడా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఏ హోటల్‌ను వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: నేడు HYDలో గంటల పాటు విద్యుత్ సరఫరా బంద్.. ఎందుకంటే?

Related News

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు

వాళ్లు క్షుద్ర పూజలు చేశారు.. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు! కూకట్‌పల్లిలో రేవంత్ సంచలనం!

స్వేచ్ఛ ఓకే.. విద్వేషం నాట్ ఓకే.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్

బొగ్గు, సిమెంట్ ధరలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన.. రాష్ట్రాల హక్కులపై క్లారిటీ!

వీడెక్కడి దొంగరా బాబు.. దొంగతనం చేసిన ఇంట్రోనే నిద్రపోయాడు!

హిందూ ముస్లింలు నా రెండు కళ్లు.. మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి!

మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు జారీ చేసిన జిల్లా కోర్టు!

వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి!

Big Stories

Advertisement
×