Kishan Reddy: కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో గనుల రంగం పురోగతి, నూతన పాలసీలతో పాటు పలు కీలక రాజకీయ, ప్రాంతీయ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గనుల బిల్లు ఆమోదం – ధరల నియంత్రణ
పార్లమెంట్‌లో క్రిటికల్ మేజర్ మినరల్స్ బిల్లు ఆమోదం పొందడం మైనింగ్ రంగంలో ఒక పెద్ద మార్పని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలపై భారం పడకుండా చూసేందుకు 2018 నుంచి ఇప్పటివరకు బొగ్గు ధరలను పెంచలేదని, దీనివల్ల విద్యుత్ తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఇదే తరహాలో సిమెంట్, స్టీల్ ధరలు కూడా పెరగకుండా కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు.
రాష్ట్రాల హక్కుల రక్షణ – బొగ్గు ఎక్స్ఛేంజ్
గనులు, పన్నులు లేదా సెస్సుల వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏనాడూ రాష్ట్రాలపై పెత్తనం చెలాయించదని ఆయన స్పష్టం చేశారు. మినరల్ ఉత్పత్తిని విపరీతంగా పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఒకే దేశం-ఒకే రేటు విధానం కోసం ‘బొగ్గు ఎక్స్ఛేంజ్’ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.
పంచదారల కొండల్లో అక్రమ మైనింగ్‌పై స్పందన
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పంచదారల కొండలలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై తమకు ఫిర్యాదులు వచ్చినట్లు మంత్రి ధ్రువీకరించారు. మైనింగ్ వ్యవహారాలు ప్రాథమికంగా రాష్ట్ర పరిధిలోనే ఉంటాయని పేర్కొంటూ, అందిన ఫిర్యాదును తగిన చర్యల కోసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ కొండల చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా పరిశీలన కోసం కేంద్ర సాంస్కృతిక శాఖకు కూడా పంపుతున్నామని చెప్పారు.
తెలంగాణ రాజకీయం – భూ కేటాయింపులు
రాజకీయంగా స్పందిస్తూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే తమ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన భూ కేటాయింపుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: వీడెక్కడి దొంగరా బాబు.. దొంగతనం చేసిన ఇంట్రోనే నిద్రపోయాడు!