Revanth Reddy: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన, అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 782 మంది మైనారిటీ అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, TGMREIS ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చేతల్లో చూపించిన కాంగ్రెస్ – 4% రిజర్వేషన్లు
హిందూ, ముస్లింలు రెండు కళ్లనే మాటను సోనియా గాంధీ చేతల్లో చూపించారని సీఎం రేవంత్ తెలిపారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, తమ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను అత్యంత పటిష్టంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ‘తెలంగాణలో అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్లు తొలగిస్తాం’ అని అమిత్ షా అన్నప్పుడు.. ముందు గుజరాత్‌లో తొలగించి చూపించాలని తాము సవాల్ విసిరామని గుర్తుచేశారు.
ఉద్యోగాలు, సముచిత స్థానం
కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ యువతకు దక్కాల్సిన న్యాయమైన స్థానాన్ని కల్పించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైనారిటీ యువకులు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారని తెలిపారు. టీజీపీఎస్సీ (TGPSC) లో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించామన్నారు. మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, రూ.3 కోట్ల నగదు బహుమతి అందించినట్లు చెప్పారు. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ (సిరాజుద్దీన్) కోసం ప్రత్యేకంగా నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం కల్పించామని వివరించారు.
నైపుణ్యాభివృద్ధి – అంతర్జాతీయ అవకాశాలు
మైనారిటీ యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా నైపుణ్యాలు (Skills) పెంచుకోవాలని పిలుపునిచ్చారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే రాష్ట్రంలో ‘స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని చెప్పారు. నైపుణ్యమే జీవితాలను మారుస్తుందని ఆకాంక్షించారు.
ఓటు హక్కు పరిరక్షణపై పిలుపు
‘SIR’ పేరుతో కొందరు అర్హుల ఓట్లను తొలగించాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. బెంగాల్‌లో గెలిచామని, తెలంగాణే టార్గెట్ అని మాట్లాడే వారికి కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తా ‘రేవంత్ రెడ్డి’గా మారి, గల్లీ గల్లీ తిరిగి ఓటర్ల జాబితాను చెక్ చేయాలని, ఏ ఒక్క అర్హుడైన మైనారిటీ కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని పిలుపునిచ్చారు.
Also Read: ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!