Formula-E Race Case: తెలంగాణలో సంచలనమైన ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేసింది. ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వీరిద్దరిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. అయితే ఈ విషయంపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలకు విజిలెన్స్ అనుమతి ఇవ్వడంతో ఫార్ములా-ఈ రేస్ కేసు మరోసారి వార్తల్లో నిలించింది. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్ లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించారు. ఈ రేస్ నిర్వహణలో విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని, దీంతో ప్రభుత్వానికి 54.88 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో కేటీఆర్, పలువురు ఉన్నతాధికారులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ రేస్ కేసులో చర్యలకు ఏసీబీ రెడీ అవుతుంది. కేటీఆర్‌పై న్యాయ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్విడ్ ప్రో కో విధానంలో ఓ సంస్థ నుంచి బీఆర్‌ఎస్ రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగం, ఈ కార్ రేసింగ్ నిర్వహణ ఖర్చు రూ.600 కోట్లకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఏసీబీ ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బ్రిటన్‌కు చెందిన ఎఫ్ఈవో హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ 9,10,11,12 సీజన్లు నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఏయూడీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలి. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. రేసింగ్ ట్రాక్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నుంచి రూ.12 కోట్ల నిధులు విడుదల చేశారు.
Also Read: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్
అయితే సీజన్ 9 నిర్వహణలో ఏస్ నెక్స్ట్ జెన్‌కు రూ.165 కోట్లు నష్టం వచ్చింది. దీంతో మిగిలిన సీజన్ల నిర్వహణ నుంచి తప్పుకుంది. దీంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, బ్రిటన్ ఎఫ్ఈవో, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్30న మరో నూతన ఒప్పందం జరిగింది. ఇందులో ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు మొత్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న గ్రీన్ కో కంపెనీ నుంచి క్విడ్ ప్రో కో రూపంలో బీఆర్ఎస్ కు రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని ఏసీబీ తన నివేదికలో తెలిపింది.