RDO Promotions: స్వేచ్చ బ్యూరో: ఇటీవల జరిగిన పదోన్నతులలో నిర్దేశిత విధానాన్ని అనుసరించకుండా, విజిలెన్స్ , ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న తహసీల్దార్లకు కూడా పదోన్నతులు కల్పించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం.పద్మనాభరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గురువారం లేఖ రాశారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్.డి.ఓ.) పదవి గ్రూప్-1 స్థాయి పదవి కాగా, ఐ.ఏ.ఎస్. పదవికి ఫీడర్ కేడర్‌గా పరిగణించ బడుతుందన్నారు. తహసీల్దార్లను ఆర్.డి.ఓ.లుగా పదోన్నతి కల్పించే సందర్భంలో ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసి, వారి సేవా రికార్డులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం మాత్రమే పదోన్నతులు ఇవ్వాలన్నారు.
జి.ఓ. ఆర్.టి. నెం. 298, తేదీ 27-05-2026 ద్వారా పన్నెండు మంది తహసీల్దార్లను తాత్కాలికంగా ఆర్.డి.ఓ.లుగా పదోన్నతి కల్పించారన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి నిర్దిష్ట నిబంధనలను పాటించలేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు తహసీల్దార్లు కోర్టు ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని పదోన్నతులు పొందారన్ానరు. ఆ ఉత్తర్వుల్లో “ప్రతివాదులు (ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ) పిటిషనర్‌ను డిప్యూటీ కలెక్టర్ పదవికి పదోన్నతి కల్పించే అంశాన్ని పరిశీలించాలి” అని మాత్రమే పేర్కొనబడిందన్నారు.
Also read: ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?
ఆ ఉత్తర్వు తహసీల్దార్‌ను తప్పనిసరిగా పదోన్నతి చేయాలని ఆదేశించే “స్పీకింగ్ ఆర్డర్” కాదని, కోర్టు కేవలం వారి విషయాన్ని పరిశీలించాలని మాత్రమే సూచించిందన్నారు. అయినప్పటికీ, కోర్టు ఉత్తర్వులను వక్రీకరించి అనేక సందర్భాల్లో పదోన్నతులు కల్పించినట్లు తెలుస్తోందన్నారు. రెవెన్యూ శాఖలో హైరార్కీ ప్రకారం తహసీల్దార్ తర్వాత ఆర్.డి.ఓ., ఆ తరువాత జిల్లా రెవెన్యూ అధికారి (డి.ఆర్.ఓ.) ఉంటారని, కలెక్టర్ గైర్హాజరైన సందర్భంలో డి.ఆర్.ఓ.లు ఆర్.డి.ఓ.ల సమావేశాలను సమీక్షిస్తారన్నారు. ఆర్.డి.ఓ. 6 నుండి 8 సంవత్సరాల సేవ అనంతరం సెలెక్షన్ గ్రేడ్ పొంది డి.ఆర్.ఓ.గా నియమించబడతారని, అయితే జి.ఓ. నెం. 298 ప్రకారం పదోన్నతి పొందిన 12 మంది తహసీల్దార్లలో 7 మందికి నేరుగా డి.ఆర్.ఓ. పోస్టింగులు ఇవ్వబడ్డాయన్నారు.
తెలంగాణ ఏసీబీ అవినీతిని నియంత్రించడానికి అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తూ కృషి చేస్తోందని, గత ఎనిమిది నెలల కాలంలో ఏసీబీ సుమారు 200 కేసులు నమోదు చేసినట్లు సమాచారం అన్నారు. అయితే, వాటిపై తదుపరి చర్యలు వేగంగా జరగడం లేదని, ఏసీబీ కేసులు తుది నిర్ణయానికి చేరడంలో ఏర్పడుతున్న ఈ అసాధారణ జాప్యం పరిపాలనలో అవినీతిని మరింత ప్రోత్సహిస్తోంది. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని నెలల కాలంలో తహసీల్దార్లకు కల్పించిన అన్ని తాత్కాలిక పదోన్నతులు, పోస్టింగులపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని, అలాగే విచారణ పూర్తయ్యే వరకు ఆ పదోన్నతులు, పోస్టింగులను అమలులో నిలిపివేయాలని కోరారు.
Also read: Voter Revision: ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన పై ప్రతిపక్షాల నీచ రాజకీయం.. రాంచందర్ రావు ఫైర్..!