Hyderabad : నాలుగేళ్ల అభి. ముద్దుముద్దుగా ఉంటాడు. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు. ఎంచక్కా ఆడుకుంటాడు. ఎక్కువగా ఏడవడు. మారాం చేయడు. ఆ బాలుడిని చూస్తే ఎవరైనా ముద్దు చేయాల్సిందే. అలాంటిది అనుకోని ప్రమాదంలో ఆ పిల్లాడు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. పేదరికం, యజమాని నిర్లక్ష్యం ఆ పసివాడి ప్రాణాలు తీసింది.
హైదరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ విషాద ఘటన. హఫీజ్‌పేట్ మార్తాండనగర్ కాలనీలో ఉంటున్న శ్రీను, నీలా దంపతుల కుమారుడు అభి. వాళ్లిద్దరూ కూలీ పనుల కోం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నాలుగేళ్ల అభి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. అతడితో ఆడుకుంటున్న మరో బాలిక చూసి ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకి చెప్పింది. వెంటనే బాలుడిని సంపులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు స్థానికులు. హాస్పిటల్‌కి తీసుకెళ్లే లోపే ఆ పసివాడు చనిపోయాడు.
వాటర్ సంపుపై డోర్ ఏర్పాటు చేయమని పలుమార్లు చెప్పినా ఇంటి యజమాని పట్టించుకోలేదని అభి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. యజమాని నిర్లక్ష్యమే తమ కుమారుడి ప్రాణాలు తీసిందని ఆరోపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల అభి చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
నీటి సంపుల విషయంలో అజాగ్రత్త అస్సలే వద్దు. ఇలాంటి ఘటలను తరుచూ జరుగుతున్నా.. జనాల్లో అవేర్‌నెస్ రావట్లేదు. ఓపెన్ సంపులు చాలా రిస్క్. వానాకాలంలో మరింత డేంజర్. వాటిని కప్పి ఉంచితేనే సేఫ్. లేదంటే, ఇలానే సంపులో పడి చిన్నపిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.