Telangana Govt: తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మరో కానుక. దసరా కానుకగా వారికి ఉచితంగా చీరలను పంపిణీ చేయాలని ఆలోచన చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. ప్రస్తుతం 25 లక్షల చీరల తయారు కాగా, మరో 40 లక్షల చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. దసరా నాటికి ఆ చీరలు రెడీ కానున్నాయి.
తెలంగాణ మహిళలకు ఊహించని శుభవార్త. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుక రెడీ అవుతోంది. మహిళలకు ఉచితంగా చీరలు ఇవ్వనుంది. ఆయా చీరల ప్రక్రియ కార్యక్రమం వేగంగా సాగుతోంది. గతంలో రద్దు చేసిన బతుకమ్మ చీరల స్కీమ్ స్థానంలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఏటా రెండు చీరలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ స్కీమ్ కోసం రూ. 318 కోట్లు కేటాయించింది. చీరల తయారీ పనులు గత ఏప్రిల్ నుంచి మొదలైంది. గడిచిన మూడు నెలల్లో కోటి 25 లక్షల చీరల తయారీ పూర్తి అయ్యింది. మరో 40 లక్షల చీరల తయారీ వేగంగా కొనసాగుతోంది. 65 లక్షల చీరల తయారీని ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చేనేత-జౌళి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
గతంలో కేవలం సిరిసిల్లలో చీరల తయారీ జరిగేది. ప్రస్తుతం సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హనుమకొండ జిల్లాలోని 11 ప్రాంతాలకు చెందిన కార్మికులకు ఆర్డర్లు ఇచ్చారు. చీరల తయారీ నేపథ్యంలో 10 వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభించింది. ఒక్కో కార్మికుడు నెలకు సుమారు 25 వేల రూపాయల వేతనం పొందుతున్నారు.
ALSO READ: కూకట్ పల్లిలో విషాదం.. కల్తీకల్లు తాగి 40 మంది అక్కడికక్కడే
చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్య నిపుణులతో చర్చించిన తర్వాత డిజైన్లను రూపొందించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. 60ఏళ్ల లోపు మహిళలకు 6 మీటర్ల పొడవు గల చీరలు ఇవ్వనున్నారు. అదే 60 ఏళ్లు పైబడినవారికి 9.5 మీటర్ల పొడవు గల చీరలు రెడీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 48 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 17 లక్షల మంది స్వయం సంఘాల మహిళలు ఉన్నారు.
ఉచిత చీరల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కమిషనర్ శైలజారామయ్య వెల్లడించారు. పనులను ఎప్పటిక్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు చివరి నాటికి చీరలు రెడీ కానున్నాయి. దసరా నాటికి రెండేసి చీరలను పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో 131 పరస్పర సహాయ సహకార సంఘాలు, 56 చిన్నతరహా పరిశ్రమల యూనిట్ల కింద చీరల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.