Gadwal Farmer: స్వేచ్చ బ్యూరో: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుంటే పెట్టుబడి వ్యయం ఎంతైనా సరే ముందు పంటను కాపాడుకుందామనే ఉద్దేశంతోనే అప్పులు చేసి మరీ ట్యాంకర్లతో నీళ్లు పోయిస్తున్నాడు ఓ రైతు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధి కురవకపోవడంతో పంట చేతికొచ్చే దశలో ఎండలు తీవ్రమై కళ్ళముందే పంట ఎండిపోతుంటే ఆ రైతు బాధ అంతా ఇంతా కాదు, పంటను కాపాడుకోవడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నం వెల కట్టలేనిది.జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మదనపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి గద్వాల పట్టణ సమీపంలో సుమారు పది ఎకరాలు కౌలుకు తీసుకొని 6 ఎకరాలలో కంది పంట సాగు చేయగా, మరో 4 ఎకరాలలో పత్తి పంట సాగు చేశాడు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో తాను వేసుకున్న నాలుగు ఎకరాల పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. కనీసం ఒక క్వింటా పత్తి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ళముందే పత్తి పంట కోల్పోయి నష్టాల ఊబిలోకి వెళ్ళిన రైతు కనీసం కంది పంటను సాగు చేసి తన నష్టాన్ని తగ్గించుకోవాలని ఆయన తపన అంతా ఇంతా కాదు.. గత వారం రోజులుగా కంది పంట కళ్ళముందే ఎండుతుంటే తట్టుకోలేక వేలాది రూపాయలు చెల్లించి టాంకర్ తెచ్చి టాంకర్ ద్వారా కంది పంటకు నీటిని అందిస్తున్నాడు. ఇప్పటికీ సుమారు 40 ట్యాంకర్ల దాకా నీటిని పడుతున్నాడు. ఇప్పటికే రెండు లక్షలు ఖర్చు చేసుకున్నానని రైతు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చెందాడు. కళ్ళముందే కంది పంట ఎండిపోతుంటే తట్టుకోలేక ఈ విధంగా భగీరథ ప్రయత్నం చేస్తున్నానని ఆయన అంటున్నాడు.
పంట ఏపుగా పెరిగి, ప్రస్తుతం కీలకమైన పూత దశకు చేరుకుంది. ఈ దశలో పంటకు తగినంత తేమ లభిస్తే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. అయితే ఎల్-నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పచ్చని చేను క్రమంగా ఎండిపోవడం ప్రారంభమైంది. కేవలం నీటి కొనుగోలు కోసమే ఇప్పటివరకు సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. పంట చేతికి వచ్చేసరికి ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆర్థికంగా తీవ్ర భారం పడుతోంది. ఎల్-నినో ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి గడ్డు పరిస్థితులే నెలకొన్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని స్థానిక రైతాంగం డిమాండ్ చేస్తోంది.
Also Read: మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!
ప్రస్తుత వర్షాకాలంలో మేఘావృతమై వర్షాలు కురవాలి. కానీ వాతావరణం ప్రతికూల పరిస్థితుల వల్ల చల్లదనానికి బదులు వేసవి తాపాన్ని తలపించేలా వేడిగాలులు, ఉమ్మరం పెడుతూ వేసవి ఉష్ణోగ్రతలు గుర్తు చేస్తున్నాయి. దీంతో ఖరీఫ్ పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. భూమిని నమ్ముకుని వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లలో నీటి శాతం తగ్గి గ్యాప్ లు ఇస్తున్నాయి. మరోవైపు పంటలను కాపాడుకునే క్రమంలో రైతులు విరివిగా బోర్లను వేయిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఇంచు, ఇంచు నర మాత్రమే నీరు పడుతోంది. కొన్నిచోట్ల కేవలం దుమ్ము మాత్రమే వస్తూ రైతుకు కన్నీరు మిగులుస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వరి, మిరప, పత్తి, కంది,ఆముదం, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పత్తి పంట ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.మిరపలో అధికంగా సంభవించే తెగుళ్లయిన కింది ముడత, పై ముడుత, నల్లి, వైరస్ తోపాటు మొక్క గిడస పోవడం, కాయ తొలుచు పురుగు వంటి అనేక రకాల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటిని అరికట్టేందుకు అనేక వ్యయ ప్రయాసాలకోర్చి క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఫర్టిలైజర్ తో పాటు సస్య రక్షణ చర్యలు చేపట్టేందుకు ఎకరాకు 50 వేలకు పైగా పెట్టుబడి అవుతోందని రైతులు వాపోతున్నారు.
Also Read: తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!