Principal Transfer: స్వేచ్చ బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్ శంకర్ బదిలీ వ్యవహారం వివాదానికి దారితీసింది. శంకర్ సార్ తమకు కావాలంటూ కొందరు విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఎమ్మెల్యే రావాలంటూ విద్యార్థులు నినాదాలు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమే అయినప్పటికీ.. రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఆందోళనకు దిగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది..ప్రిన్సిపల్‌పై విద్యార్థులకు అభిమానం ఉండటం సహజమే. అయితే ఆ అభిమానం రోడ్డు నిరసనగా మారే పరిస్థితి ఎలా ఏర్పడిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థులు స్వచ్ఛందంగానే ఆందోళనకు వచ్చారా? లేక పాఠశాలలోని పెద్దల ప్రభావం, ప్రోత్సాహం ఏమైనా ఉందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థుల భావోద్వేగాలను ముందుకు పెట్టి బదిలీ ఉత్తర్వులపై ప్రభావం చూపే ప్రయత్నం జరిగిందా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపైకి తీసుకురావడం సరైన పద్ధతేనా? ఒకవేళ ఆందోళనకు ఎవరైనా ప్రేరేపించి ఉంటే.. వారి ఉద్దేశం ఏమిటి? అనే విషయాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
Also read: పవర్ బ్యాంక్ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!
మొత్తం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థులు ఎందుకు ఆందోళనకు దిగారు..? ఆందోళనకు పిలుపునిచ్చింది ఎవరు? ప్రిన్సిపల్ బదిలీపై ఇంతటి వ్యతిరేకతకు కారణాలేమిటి? పాఠశాల నిర్వహణలో విద్యార్థులపై ఎలాంటి ప్రభావం ఏర్పడింది? వంటి అంశాలను విచారించి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపల్ కోసం విద్యార్థుల ఆందోళనా.. విద్యార్థుల పేరుతో బదిలీని అడ్డుకునే ప్రయత్నమా..?’ అన్న ప్రశ్నలు ప్రస్తుతం తొర్రూరులో చర్చనీయాంశంగా మారాయి.
Also read: ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!