Gali Janardhan Reddy: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న నలుగురు దోషులకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఉన్న నలుగురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులు విధించింది.
ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితులకు ఇటీవల హైదరాబాద్ సీబీఐ కోర్టు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు తలుపు తట్టారు. న్యాయస్థానం తనకు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరారు. లేకుంటే తన నియోజక వర్గాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే మూడేళ్లు జైలు జీవితం గడిపానని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఒకవేళ తన స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తీవ్రంగా నష్టపోతానని వివరించారు. గాలి తరపు న్యాయవాది వాదనలపై సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. నిందితులకు శిక్షను సస్పెండ్ చేసేందుకు అసాధారణ పరిస్థితులు లేవని తెలిపింది. ఆయనపై ఇతర కేసులు నడుస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది.
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు, గాలి జనార్థన్ రెడ్డితోపాటు మరో ముగ్గురికి ఉపశమనం కల్పించింది. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ పలు షరతులు విధించింది. 10 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని షరతు విధించింది.
ALSO READ: కమిషన్ ముందుకు కేసీఆర్, వన్ టు వన్ విచారణ
అంతేకాదు దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టును న్యాయస్థానానికి అప్పగించాలని తీర్పులో ప్రస్తావించింది. తదుపరి విచారణకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ షరతులు విధించినట్లు స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్తుందా? లేదా అనేది చూడాలి.
అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ అక్రమాలపై అప్పటి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. 14 ఏళ్ల పాటు ఈ కేసు దర్యాప్తు, విచారణ సాగింది. చివరకు 2015 మే 6 సీబీఐ న్యాయస్థానం తీర్పు వెల్లడించడం, వెంటనే శిక్షలు ఖరారు చేయడం జరిగిపోయింది.
ఈ కేసులో కీలక నిందితులు గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి రాజగోపాల్‌కు అదనంగా నాలుగేళ్లు జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించింది సీబీఐ న్యాయస్థానం విధించిన సంగతి తెల్సిందే.