GHMC: స్వేచ్ఛ బ్యూరో: పీకల దాక అప్పుల పాలై కొట్టుమిట్టాడుతూ, ఆర్థిక సంక్షోభంలో నూరేళ్లు ఆయుశ్శు దిన దిన గండంగా మారినా, ఆర్థికంగా గాడీన పెట్టేందుకు అధికారులు కనీస ప్రయత్నాలు చేయకపోవటంతో పాటు అడ్డదారిలో అక్రమాలకు తెర తీస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన శానిటేషన్ పేరిట జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు మరో అక్రమానికి తెర దీశారు. గడిచిన అయిదేళ్లుగా అందుబాటులో ఉన్న పాలక మండలి కౌన్సిల్ సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తూ టేబుల్ ఐటమ్స్ లతో సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన పాలక మండలి గడువు గత నెల 10వ తేదీన ముగిసిన తర్వాత కనీసం స్పెషలాఫీసర్ పాలనలోనైనా పరిపాలన, అభివృద్ది సక్రమంగా జరుగుతుందన్న భావించిన మహానగరవాసుల ఆశలు అడియాశలే కానున్నాయి.
ఆర్థిక కష్టాల్లోనున్న కార్పొరేషన్ ను కొంత వరకైనా గట్టెక్కించేందుకు కృషి చేయాల్సిన అధికార యంత్రాంగం సైతం అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తమ స్వప్రయోజనాల కోసం పర్యాటక ప్రాంతాల వద్ద పారిశుద్ధ్య పనులను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టి, జీహెచ్ఎంసీపై అదనపు ఆర్థిక భారం మోపేందుకు సిద్దమైనట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ పాత పరిధిలోని పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుగా నిర్వహించేందుకు వీలుగా 2012 నుంచి అమలు చేస్తున్న రాంకీ ఒప్పందాన్ని పక్కన బెట్టి పర్యాటక ప్రాంతాల్లో శానిటేషన్ పనులను ఇతర ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించేందుకు అధికారులు సోమవారం జరిగిన కార్పొరేషన్ మీటింగ్ లో నిర్ణయించిన సంగతి తెల్సిందే.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు పోగయ్యే సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 7 వేల మెట్ర్రిక్ టన్నుల చెత్తకు ప్రస్తుతం ఒక్క మెట్రిక్ టన్ను చెత్తకు జీహెచ్ఎంసీ రూ. 2 వేలను చెల్లిస్తుంది. అగ్రిమెంట్ చేసుకుని అమల్లోకి తెచ్చిన 2012 లో ఒక్క మెట్రిక్ టన్ను చెత్తకు సుమారు రూ. 810 గా ఫిక్స్ చేసి, ప్రతి ఏటా అయిదు శాతం పెంచుతూ ప్రస్తుతం ఒక్కో మెట్రిక్ టన్ను చెత్తకు రూ. 2 వేల పై చిలుకు చెల్లిస్తున్నారు. మున్ముందు జీహెచ్ఎంసీ ఎంత విస్తరించినా, పెరుగుతున్న పరిధిని బట్టి రాంకీ ఒప్పందాన్ని సవరించుకునే వెసులుబాటు నాటి అగ్రిమెంట్ లో ఉన్నా, అధికారులు పర్యాటక ప్రాంతాల పారిశుద్ధ్య పనులను రాంకీకి కాకుండా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇది రాంకీకి ఒక రకంగా ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చేందుకేనన్న వాదనలున్నాయి.
Also Read: Gajwel District Hospital: గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. శభాష్..!
తాజాగా కార్పొరేషన్ కమిటీ మీటింగ్ తీసుకున్న పలు నిర్ణయాలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 2వ తేదీ సోమవారం జరిగిన సమావేశంలో జూబ్లీహిల్స్‌లో 98.92 చదరపు గజాల భూమి బదలాయింపునకు సంబంధించి అధికారులు తమ సొంత ప్రయోజనాల కోసం ఈ భూ బదలాయింపు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో గజం భూమి కనిష్టంగా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ధర పలుకుతుండగా, అధికారులు నామమాత్రపు ధరకే ఈ భూమిని బదలాయించినట్లు ఆరోపణలున్నాయి.
పాలక మండలి అధికార గడువు ముగిసి వెళ్లిపోయిన తర్వాత వచ్చిన స్పెషలాఫీసర్ పాలన ఆదిలోనే ఇలాంటి అక్రమాలు వెలుగులోకి రాగా, పాలక మండలి హయాంలో జీహెచ్ఎంసీ ఆస్తుల లీజుకు సంబంధించి కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైమ్ ప్రాంతాలైన సికిందరాబాద్, కోఠి ప్రాంతాల్లోని జీహెచ్ఎంసీ ఆస్తుల్లో అద్దెకు కొనసాగుతున్న పలువురు వ్యాపారులు, వ్యాపార సంస్థలు కూడా అప్పట్లో పాలక మండలికి భారీ మొత్తంలో ముడుపులు చెల్లించి అడ్డదారుల్లో లీజులను ఎక్స్ టెన్షన్ చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. అంతేగాక, మలక్‌పేటలో 333.51 చదరపు గజాల స్థలాన్ని అత్యధిక ధరకు బిడ్ చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతిస్తూ కార్పొరేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయం వెనకా కూడా రాజకీయపరమైన వత్తిళ్లు, ఆర్థిక లావాదేవీలున్నట్లు చర్చ లేకపోలేదు.
Also Read: Herbicide Ban: ఈ గడ్డి మందుతో మనుషుల ప్రాణాలు పోతున్నాయ్..?