GHMC Financial Crisis: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధిక జనాభాకు పౌర సేవలతో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ పరిస్థితి బాధ్యతలెక్కువ, ఆదాయం తక్కువగా తయారైంది. ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ఆర్థికంగా కొంత మేరకైనా ఊరట కల్గించాలన్న ఉద్దేశ్యంతో అధికారులు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఒక్క ప్రయత్నం కూడా ఫలించటం లేదు. ఈ క్రమంలో నిధులు ఖర్చు చేసి నిర్వహిస్తున్న బాధ్యతలను తగ్గించుకునే దిశగా ప్రయత్నం చేస్తుండగా, సర్కారు అదనంగా క్యూర్ సిటీ పరిధిలోని పలు ముఖ్యమైన బాధ్యతలు జీహెచ్ఎంసీకి అప్పగించింది.
స్ట్రీట్ లైట్ల భారం..
క్యూర్ సిటీ పరిధిలోని మూడు కార్పొరేషన్ల వారీగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సి ఉండగా, మొత్తం క్యూర్ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ నోడల్ ఏజెన్సీ వ్యవహారించే బాధ్యతలను కట్టబెడుతూ సర్కారు ఇటీవలే జీవోను జారీ చేసిన సంగతి తెల్సిందే. మూడు కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితి గమనిస్తే సైబరాబాద్ రిచ్ కార్పొరేషన్ కాగా, మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఆశాజనకంగానే ఉంది. కానీ క్యూర్ లో అతి పెద్ద కార్పొరేషన్ గా అయిన జీహెచ్ఎంసీ ఆర్థికంగా పుట్టెడు కష్టాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో సర్కారు అదనపు బాధ్యతలను కట్టబెట్టడంతో సిబ్బంది పరంగా నిధుల పరంగా జీహెచ్ఎంసీ బలహీనపడింది. దీంతో జీహెచ్ఎంసీ పరిస్థితి మూలుగుతున్న నక్కపై తాటికాయ పడినట్టయింది. గతంలో పాత జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ది కోసం చేసిన అప్పులను జీహెచ్ఎంసీయే చెల్లించాలని క్లారిటీ ఇచ్చిన సర్కారు అందుకు అవసరమైన నిధులను కూడా ఇచ్చేందుకు సానుకూలతను వ్యక్తం చేసినా, ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు అంతంతమాత్రమే. తాజాగా క్యూర్ సిటీ పరిధిలోని స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు (వరద నీటి కాలువ)లను గుర్తించేందుకు బాధ్యతలను కూడా జీహెచ్ఎంసీకే అప్పగించినట్లు సమాచారం.
క్షేత్రస్థాయిలో కలెక్టర్..
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని వరద నీటి కాలువలను గుర్తించటంతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద నీటి కాలువలను కూడా గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు తమ పరిధిలోని వరద నీటి కాలువల వివరాలను సమర్పించటంలో నిమగ్నమై ఉన్నాయి. వరద నీటి కాలువను గుర్తించి మాస్టర్ ప్లాన్ ను రూపకల్పన చేసేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ కన్సల్టెన్సీల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) లను ఆహ్వానించగా, తొలుత రెండు ఏజెన్సీలు ఈఓఐలను సమర్పించగా, ఆ తర్వాత మరో సారి ఆహ్వానించగా, కేవలం ఒకే ఒక కన్సల్టెన్సీ ముందుకు రావటంతో సింగిల్ కన్సల్టెన్సీ తో ముందుకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ జీహెచ్ఎంసీ మళ్లీ సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సర్కారు అనుమతి రాగానే కన్సల్టెన్సీ క్షేత్ర స్థాయిలో వివిధ ప్రాంతాలను ఫిజికల్ గా విజిట్ చేసి, కాలువలను గుర్తించేందుకు అవసరమైన మౌలిక వసతులను జీహెచ్ఎంసీ కల్పించాల్సి ఉంది.
రూ. 879 కోట్లు పెరిగిన స్ట్రీట్ లైట్ల నిర్వహణ వ్యయం
జీహెచ్ఎంసీ రూపకల్పన చేసి సర్కారు పంపిన మార్గదర్శకాల్లో అయిదేళ్లు నిర్వహణ కాలపరిమితిని సర్కారు పదేళ్లకు పెంచుతూ మార్పులు చేసింది. అంతేగాక, గత సంవత్సరం నవంబర్ మాసంలో చివరలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో విలీనమైన మరో 27 పట్టణ స్థానిక సంస్థలు. జీహెచ్ఎంసీలోని స్ట్రీట్ లైట్లను కలిపి సుమారు 7 లక్షల 60 వేల 591 స్ట్రీట్ లైట్ల నిర్వహణకు అప్పట్లో రూ. 841 కోట్ల వ్యయ ప్రతిపాదనను జీహెచ్ఎంసీ సర్కారుకు పంపగా, నిర్వహణలో పారదర్శకత, అదనంగా 15 వేల స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న సర్కారు అంచనా వ్యయాన్ని రూ.1341 కోట్లకు పెంచుతున్నట్లు అప్పట్లో ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో క్యూ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ వ్యయం రూ. 500 కోట్లు అదనంగా పెరగగా, ఇపుడు అది కాస్త ఫైనల్ గా రూ. 1720 కోట్లకు పెరిగింది. రూ. 841 కోట్లుగా పేర్కొన్న సమయంలో అదనంగా రూ. 500 కోట్లు పెరగగా, సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంగళవారం నాటికి స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ వ్యయం అదనంగా మరో రూ. 879 కోట్లకు పెరిగింది.
జీహెచ్ఎంసీ నెత్తిన ‘క్యూర్ సిటీ’ బాధ్యతలు!
జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీకి చెల్లించాక, జీహెచ్ఎంసీ ద్వారా నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న సంస్థలకు చెల్లించేలా నోడల్ ఏజెన్సీ బాధ్యతలను కూడా సర్కారు జీహెచ్ఎంసీకి కేటాయించింది. మొత్తం వ్యయం రూ. 1720ని జీహెచ్ఎంసీ కన్సార్టియంలోని ఏజెన్సీలకు ఏటా పది శాతం అంటే రూ.172 కోట్లు చెల్లించనుంది. వీటిలో వెలగని స్ట్రీట్ లైట్లకు అయ్యే వ్యయాన్ని మినహాయించి చెల్లించనుంది. సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు స్ట్రీట్ లైట్ల నిర్వహణ వ్యయాలను చెల్లించనున్నా, తొలుత జీహెచ్ఎంసీ చెల్లించి, ఆ తర్వాత మిగిలిన రెండు కార్పొరేషన్ల నుంచి వసూలు చేసుకోవల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా జీహెచ్ఎంసీపై అదనపు ఆర్థిక భారమేనని చెప్పవచ్చు.
Also Read: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?