GHMC: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సరి కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీని రూపొందించేందుకు కసరత్తు చేస్తుంది. ఇటీవలే సీఎం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో కూడా ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెల్సిందే. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో హోర్డింగ్ లు, యునిపోల్స్ పై జీహెచ్ఎంసీ వ్యాపార ప్రకటనలు కొనసాగేవి. కొంత కాలం క్రితం వరుసగా జరిగిన ప్రమాదాలతో జీహెచ్ఎంసీ హోర్డింగ్ లు, యునిపోల్స్ పై నిషేధం విధించటంతో అడ్వర్ టైజ్ మెంట్ ఏజెన్సీలు కోర్టును ఆశ్రయించాయి. తాజాగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగని ప్రాంతాల్లో, ఫ్లై ఓవర్లకు ఇతర పబ్లిక్ ప్లేస్ లలో అడ్వర్ టైజ్ మెంట్లు హోర్డింగ్ లు, యునిపోల్స్ ను అందుబాటులోకి తెచ్చేలా జీహెచ్ఎంసీ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం తుది దశలోనున్న అధికారుల కసరత్తు త్వరలోనే తుదిదశకు చేరనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కొత్త పాలసీని మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టి, సర్కారు సూచించే మార్పులు, చేర్పులు చేసిన తర్వాత అమలులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ యోచిస్తుంది. ముఖ్యంగా ఈ పాలసీలో హోర్డింగ్ లు, యునిపోల్స్ ను ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, వీటి సంఖ్య ఎంత వరకు పరిమితం చేయాలి? వీటిలో సర్కారు ఆదేశాల మేరకు పది శాతం సర్కారు స్కీమ్ ల ప్రచారానికి కేటాయించి మిగిలిన వాటిని ఆన్ లైన్ ఆక్షన్ లో కేటాయించేలా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. వీటిలో కొన్నింటిని పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో ఏర్పాటు చేసి, పరిమిత కాలం వీటిని ఏర్పాటు చేసిన సంస్థలకు అప్పగించి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ సొంతం చేసుకునే మార్గదర్శకాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. యునిపోల్స్, హోర్డింగ్ ఏర్పాటులో ఆర్థిక భారం లేకుండా ఏర్పాటు చేసి, వీటితో వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ కు సమీపంలోనున్న ఫ్లై ఓవర్లు, ప్రైవేటు భవనాలు, ఫ్లై ఓవర్లపై వీటిని ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలిసింది. ఒక్కసారి ఏర్పాటు చేసి వదిలేయకుండా, వీటి నిర్వహణపై కూడా ఈ సారి జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అడ్వర్ టైజ్ మెంట్లతో వచ్చే ఆదాయం ఏ మాత్రం పక్కదారి పడకుండా చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటి ఏర్పాటు, నిర్వహణతో పాటు కేటాయింపులను కూడా పారదర్శకంగా నిర్వహించేలా ఈ మార్గదర్శకాలున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం అప్పటి ఈవీడీఎం కమిషనర్ గా వ్యవహారించిన విశ్వజిత్ కంపాటి సిటీలో అభివృద్ది చెందిన కెనడా దేశంలో మాధిరిగా సరి కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీని తీసుకువచ్చేందుకు కొంత ప్రయత్నం కూడా జరిగింది.
ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో గతంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్ లన్నింటినీ తొలగించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు. 27 పట్టణ స్థానిక సంస్థల్లో గతంలో ఏజెన్సీలు తీసుకున్న అనుమతుల కన్నా రెండింతలుగా హోర్డింగ్ లు, యూనిపోల్స్ ను ఏర్పాటు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు జీహెచ్ఎంసీ ఇటీవలే గుర్తించిన నేపథ్యంలో త్వరలోనే వీటిపై చర్యలకు జీహెచ్ఎంసీ సిద్దమవుతున్నట్లు తెలిసింది. పట్టణ స్థానిక సంస్థల పరిధి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినందున గతంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లు, యునిపోల్స్ పై అధ్యయనం నిర్వహించి, ట్రాఫిక్ సిగ్నల్స్, కూడళ్లు, మెయిన్ రోడ్లలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం, ఆస్కారమున్న వాటిని గుర్తించి వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైనట్లు సమాచారం.
Also Read: Congress: ఖర్గే నివాసంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ.. రెండేళ్ల పాలనపై రాహుల్, ఖర్గే సమీక్ష!