CM Revanth Reddy: హైదరాబాద్ మహానగర భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 7న ఒకేసారి పలు ప్రాజెక్టుల శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ప్రధానమైనది గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ టు, త్రీ. ఈ ప్రాజెక్టు ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు తిరిగి మంచినీటితో నిండబోతున్నాయి. మూసీ పునరుజ్జీవన పథకానికి ఇది పునాది రాయిగా భావిస్తున్నారు.
రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు హమ్ విధానంలో చేపడుతున్నారు. ఇందులో ప్రభుత్వం 40 శాతం వాటా కల్పిస్తే, మిగతా 60 శాతం నిధులను కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుంది. రెండు ఏళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రణాళిక ప్రకారం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి, అందులో 2.5 టీఎంసీలను మూసీ పునరుజ్జీవనానికి, మిగిలిన 17.50 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నారు. మార్గమధ్యంలో ఉన్న 7 చెర్వులు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నిండి స్థానికులకు లాభం చేకూరనున్నాయి. 2027 డిసెంబర్ నాటికి ప్రతి రోజు నగరానికి నిరంతర తాగునీటి సరఫరా అందేలా ఇది అమలు చేయబడనుంది.
ఇక, మరో ముఖ్యమైన ప్రాజెక్టు ఓఆర్ఆర్.. ఫేజ్ 2 కింద అమలవుతోంది. దీనిలో జిహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయితీలకు తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. మొత్తం 71 రిజర్వాయర్లు ఏర్పాటు చేయగా, అందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పూరం, పటాన్‌చెరు, బొలారం వంటి 14 మండలాల్లోని సుమారు 25 లక్షల మందికి శాశ్వతంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Visakhapatnam fire: పిడుగు పడి పేలిన పెట్రో ట్యాంక్.. విశాఖలో కలకలం!
అదేవిధంగా, కోకాపేట్ లేఅవుట్ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన జరగనుంది. రూ.298 కోట్ల వ్యయంతో నియో పోలీస్ – సెజ్ పరిధిలో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఇది రెండు ఏళ్లలో పూర్తికానుండగా, దాదాపు 13 లక్షల మందికి ఈ సౌకర్యం లభిస్తుంది.
ఈ ప్రాజెక్టులన్నీ పూర్తికావడంతో హైదరాబాద్ తాగునీటి సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. గతంలో వేసవికాలాల్లో నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులకు ఇది శాశ్వత పరిష్కారమవుతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో నీరు నింపడం ద్వారా నగరానికి పునరుజ్జీవనం లభించడమే కాకుండా, మూసీ నది పునరుద్ధరణకు కొత్త ఊపిరి లభిస్తుంది.
మొత్తం మీద, గోదావరి నీటి వనరులను వినియోగించి, ఆధునిక టెక్నాలజీ ఆధారంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులు రాబోయే కాలంలో హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు కూడా భరోసా కలిగించేలా ఉండనున్నాయి. నగర విస్తరణ, జనాభా పెరుగుదల దృష్ట్యా ఇవి సమయానుకూలంగా చేపడుతున్న ప్రాజెక్టులుగా పరిగణించబడుతున్నాయి.