Gone Prakash Rao : తెలంగాణాలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పించగా… తాజాగా ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) బీసీ నినాదంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు (Gone Prakash Rao) మండిపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. “ఇది అంతం కాదు..ఆరంభం” అని చెప్పి భారత జాగృతి తరుపున దేశమంతా పర్యటిస్తామని చెప్పిందని.. ప్రస్తుతం అది మానేసి బీసీ నినాదం వైపు ఎందుకు మళ్లిందని ప్రశ్నించారు. పదేళ్లలో బీసీల కోసం ఏం చేయని కవితకు ఇప్పుడు ప్రేమ పట్టుకొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. బీసీలను అడ్డు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు.. సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన లెక్కలను పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడూ వాడుకోలేదని, బీఆర్ఎస్ హయాంలో 33 నుంచి 23శాతం మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. కేబినెట్ తో పాటు పార్టీలో సైతం బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదని విమర్శించారు.
జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. కేటీఆర్ (MLC) కూడా జైలుకు వెళ్లాలనుకుంటున్నారని.. కేటీఆర్ కు కవిత పోటీ అవుతున్నారని తెలిపారు. కవిత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారనే సమాచారం తన వద్ద ఉందని గోనె ప్రకాశరావు తెలిపారు. బీసీల కోసం కవిత ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని.. బీసీలపై కవితకు ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి పోయిందని… పరిస్థితిని గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం సీఎం కావాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ కాస్త ఓపిక పట్టాలని తెలిపారు.
ALSO READ : జనంలోకి కేసీఆర్.. వెనకడుగు పడినట్లే?
తెలంగాణాలో దళితుడిని సీఎం చేయలేదని.. దళితులు 18 శాతం, ఎస్టీలు 6శాతం ఉన్నప్పటికీ చెరొక పదవి మాత్రమే ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళకు మంత్రి పదవి దక్కలేదని.. రెండోసారి ప్రభుత్వంలోనూ టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన మహిళలకే మంత్రి పదవులు కట్టబెట్టారన్నారని విమర్శించారు. సావిత్రిభాయి పూలే జయంతి రోజున ధర్నాలు చేయడం కవిత అవివేకానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా అసెంబ్లీలో బావ, బామ్మర్ధులు తప్ప బీసీలను, ఇతరులను మాట్లడనివ్వరని తెలిపారు.