Telangana Registration: తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 10 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం అవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదట ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. స్లాట్ బుకింగ్ తో 10 నుంచి 15 మినిట్స్ లోనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా.. వేగవంతంగా సేవలను అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులో తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్ సైట్: https://registration.telangana.gov.in/
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా మరింత మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి ఉంచకుండా జస్ట్ 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉన్న విషయం తెలిసిందే. అయితే మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.
ఇవే 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..
మొదట దశలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పేర్లను రేవంత్ సర్కార్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లాలో రామగుండం, ఖమ్మం జిల్లాలో కూసుమంచి, అలాగే ఖమ్మం (R.O), మేడ్చల్ (R.O), మహబూబ్‌నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల మొదట దశలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎక్కువ సంఖ్యలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం జరిగే జప్యాన్ని నివారించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలు నేరుగా అధికారిక వెబ్ సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకోని వారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ALSO READ: ESIC Recruitment: ఈఎస్ఐసీలో 558 ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..