Hyderabad Tourism: హైదరాబాద్ మహా నగరం ఎన్నో సుందర పర్యాటక ప్రాంతాలకు నిలయం. ఈ మహా నగరానికి వచ్చారంటే చాలు.. చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఎందరో విదేశీయులను కూడ ముగ్ధులను చేసే సందర్శక ప్రాంతంగా మహా నగరం ప్రసిద్ది కాంచింది. అటువంటి మహా నగరానికి మరిన్ని సొగసులు దిద్దేందుకు సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకై ప్రత్యేక కార్యాచరణను కూడ ప్రభుత్వం సిద్దం చేసింది. అందులో భాగంగా
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీ -2025 ను ప్రవేశ పెట్టింది. ఈ పాలసీ ద్వార పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందుకై సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రదేశాలను, వారసత్వ కట్టడాలను, గుర్తించి ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీలో పొందు పరుచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెల్త్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి తద్వారా పర్యాటకుల సంఖ్యను భారీ ఎత్తున ఆకర్షించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులకు సూచించారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు చారిత్రక కట్టడాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలలో సందర్శించేందుకు స్కై వాక్ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని సి.ఎస్ అధికారులకు సూచించారు.
ఇతర రాష్ట్రాలలో అమలులో ఉన్న వివిధ టూరిజం పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రానికి సరిపడ నూతన టూరిజం పాలసీ-2025 ను యువజన, పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేశారు. నూతన పాలసీపై సి.ఎస్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
Also Read: Viral News: పెళ్లాం పుట్టింటికి వెళ్లిందని.. ఈ భర్త చేసిన సంబరాలకు అందరూ షాక్..
ఈ సమావేశంలో రాష్ట్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారులు కె.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమలు, ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ఎస్.సంగీత, చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, TGTDC MD ప్రకాష్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.