Hyderabad: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేశ్ తొలి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరిన గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
బడా గణేశుడికి 15కిలోల వెండి కడియం, జంజం..
బడా గణేశుడికి ఎమ్మెల్యే దానం నాగేందర్ 15 కిలోల వెండి కడియం, జంద్యం సమర్పించారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు తొలి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుని కోరుకుంటున్నానని తెలిపారు.
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గవర్నర్‌ను సత్కరించిన ఎమ్మెల్యే దానం, మంత్రి పొన్నం
బోనాల వేడుకల లాగే గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
Also Read: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?
బడా గణేశ్ తొలి దర్శనం కోసం తరలొస్తున్న జనం
మరోవైపు ఓ వైపు వర్షం పడుతున్న లెక్క చేయకుండా క్యూ లైన్లలో నిల్చొని గణేశుడి ఆశీర్వాదం కోసం తీసుకుంటున్నారు. భక్తుల కోలాహలంతో ఖైరతాబాద్ ప్రాంత సందడిగా మారింది. జై గణేశా.. జైజై గణేశా నినాదాలతో ఖైరతాబాద్గణేశ్మండప ప్రాంతం దద్దరిల్లిపోతుంది. గణనాథుడి దర్శనం కోసం భక్తులు పొటెత్తడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బడా గణపతి వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం
తొలిపూజ చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తొలిపూజ తర్వాత భక్తుల దర్శనం ప్రారంభం
ఉదయం నుంచే మొదలైన భక్తుల రద్దీ
బడా గణేష్ తొలి దర్శనం కోసం భారీగా తరలివస్తున్న భక్తులు… pic.twitter.com/i3xHtdtFAd
— BIG TV Breaking News (@bigtvtelugu) August 27, 2025