Chowmahalla Palace: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఈనెల 10న గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ అందాల పోటీల కోలాహలం మొదలయ్యింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయ్యాయి. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో మిస్ వరల్డ్ పోటీలు మొదలయ్యాయి. గుస్సాడీ, కొమ్ము కోయ కళాకారులు ప్రదర్శన విదేశీ అతిధులను ప్రత్యకంగా ఆకర్షించింది. వివిధ దేశాల ప్రతినిధులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర అధికారులు కార్యక్రమం పాల్గొన్నారు.
కాగా.. తెలంగాణ పర్యాటక శాఖ మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. విశ్వసుందరి పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు నేడు చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ డిన్నర్‌లో వివిధ దేశాల సుందరీమణులు, ప్రతినిధులు పాల్గొననున్నారు.విందుకు హాజరు కావడానికి ముందు మిస్‌వరల్డ్ పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్‌బజార్ గాజుల మార్కెట్ మీదుగా హెరిటేజ్ వాక్‌గా చౌమొహల్లాకు చేరుకుంటారు.వీరి రాక నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ డైవర్షన్స్ విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ టూ శాలిబండ, శాలిబండ నుంచి వోల్గా జంక్షన్ వరకు, వోల్గా జంక్షన్ నుంచి మూసబౌలీ వయా ఖిల్వత్ రోడ్డులో ఏలాంటి వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
అంతకముందు సుందరీమణులు నిన్న నాగార్జునసాగర్‌లో సందడి చేశారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో నిర్వహించిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు మిస్ వరల్డ్ ఆసియా గ్రూప్–4లోని 22 దేశాల సుందరీమణులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్నారు. వారికి పర్యాటక శాఖ, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. విజయవిహార్ వెనుకభాగంలోని పార్కులో ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీపర్వతారామంలోని బుద్ధవనానికి చేరుకున్నారు. ముందుగా బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు.
మహాస్తూపం వద్ద వీరికి తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. 6.42 గంటలకు వారికి శిల్పాలను చూపిస్తూ ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు, తెలంగాణకు బౌద్ధమతంతో గల సంబంధం తదితర అంశాలను వివరించారు. మహాస్తూపంలోని పంచ ధ్యానబుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు ధ్యానం చేశారు. రాత్రి 7.08 గంటలకు బుద్ధ జయంతి కార్యక్రమాలలో భాగంగా బౌద్ధ భిక్షవులు నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Also Read: కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్.. 30 మంది మావోలు హతం..
అనంతరం జాతకవనంలో కళాకారులు బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డిన్నర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్ పాల్గొన్నారు.