E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

తుంగభద్ర జలాలపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

తుంగభద్ర జలాలపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
Advertisement

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను విరమించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే బుద్దితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ

Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం లేఖ రాశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూనే.. అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి ఎన్ఓసీ తెస్తున్నాం అనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా? అని నిలదీశారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2టీఎంసీ), చిక్కాలపర్వి(2.5టీఎంసీ), చిక్కాలమంచి (5 టీఎంసీ) బ్రిడ్జ్-కమ్-బరాజ్‌లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు.

ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు?

Advertisement

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఎగువన కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్‌కు రావాల్సిన ప్రవాహాలు తగ్గిపోతాయన్న విషయం తెలియదా? అన్నారు. లేక తెలిసే ఇదంతా చేస్తున్నారా? రాయచూర్ జిల్లాలో 2 టీఎంసీల నీటిని తరలించే కురిడి ఎత్తిపోతల పథకాన్ని రూ.85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్నంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇన్టేక్ నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తి అయితేప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదా? ఈ అక్రమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదు? అని ప్రశ్నించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? దీని వెనుక ఉన్న లోపాయికార ఒప్పందాలు ఏమిటి? అని నిలదీశారు.

Also Read: స్కీములు లేవు కానీ.. రోజుకో స్కాం! కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్

పాలమూరు రైతాంగానికి మరోసారి అన్యాయం

ఇప్పటికే ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు సరిగా అందని పరిస్థితి ఉందని, కర్ణాటక తనకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తోందన్నారు. ఆర్డీఎస్ లో కర్ణాటక వాటా 1.2 టీంసీ మాత్రమేనని, కానీ సగటున 5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువన అక్రమంగా కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్, చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే తెలంగాణ వాటా మరింత తగ్గిపోతుందన్నారు. ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, వాటిని దెబ్బతీసే కర్ణాటక అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరించడం రాష్ట్రానికి ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారని, 16.94 టీఎంసీల కేటాయింపులో సుమారు 7 టీఎంసీలను కొడంగల్ లిఫ్టుకు మళ్లించి 2లక్షల ఎకరాలకు నీళ్లు అందించే భీమా ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్నారు. ఇప్పుడు ఆర్డీఎస్ విషయంలో కర్ణాటకతో లోపాయికార ఒప్పందం చేసుకొని పాలమూరు రైతాంగానికి మరోసారి అన్యాయం చేస్తున్నారన్నారు.

తెలంగాణా ప్రయోజనాలకు ద్రోహం తలపెట్టడం కాదా ?

కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకే పరిమితం కాదని, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం అన్నారు. తుంగభద్ర జలాలను కర్ణాటక ఇష్టారాజ్యంగా వినియోగించకుండా బచావత్ ట్రిబ్యునల్ అనేక నిబంధనలను కృష్ణా అవార్డులో పొందుపరచిందని, అయినప్పటికీ ఆ నిబంధనలు ఖాతరు చేయకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా బ్రిడ్జి కం బ్యారేజీలను, ఎత్తిపోతల పథకాలను నిర్మించడానికి పూనుకుంటున్నదన్నారు. ఇంత ద్రోహం జరుగుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం తెలంగాణా ప్రయోజనాలకు ద్రోహం తలపెట్టడం కాదా ? అని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో కేసు?

తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలని, తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తు.చ తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో కేసు వేయాలని,కమిషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్ చేశారు. సమైక్య పాలనలో కృష్ణా జలాల కేటాయింపులో, వినియోగంలో జరిగిన అన్యాయాలకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన పాలమూరు ప్రజలు, తమ జల హక్కులను కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు.

Related News

మునుగోడు అభివృద్ధిపై రాజీ పడేదేలే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

స్కీములు లేవు కానీ.. రోజుకో స్కాం! కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్

అంగరంగ వైభవంగా బోనాలు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు!

తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ఈ ఒక్కటి చేయకుంటే మీ ఓటు గల్లంతే!

కేటీఆర్, హరీష్‌రావులకు ఎందుకంత కడుపుమంట? ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు!

ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే.. బ్లైండ్‌గా వెళ్లిపోవ‌డ‌మే! మ‌హిళ‌లు ఇంకా ఇంత వివ‌క్ష ఎదుర్కొంటున్నారా?

Hyderabad: తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్, జాయినింగ్ కమిటీ ఏర్పాటు

Big Stories

×