Hyderabad Rains: రెండురోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి వేకువజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఉదయం డ్యూటీలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇబ్బందులుపడున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ అనే చక్రవ్యూహంలో చిక్కుకుంటున్నారు.
హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిచి ముద్దవుతోంది. గడిచిన మూడురోజులుగా సాయంత్రం నాలుగైతే చాలు వర్షాలు దంచి కొడుతున్నాయి. గడిచిన రెండు రోజులు మధ్యాహ్నం వరకు బాగానే వాతావరణం కనిపించింది. సాయంత్రం అయ్యేసరికి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా సాయంత్రం డ్యూటీ దిగి ఇంటికి వెళ్లాలనుకునేవారు నరకం అనుభవిస్తున్నారు.
ట్రాఫిక్ జామ్‌తో గంటల తరబడి నరకం అనుభవిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షానికి భాగ్యనగరం బాగానే తడిచి ముద్దయ్యింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా కూకట్‌పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, గచ్చిబౌలీ, పంజాగుట్టు, మెహదీపట్నం, శేర్లింగంపల్లి, ప్యాట్నీ, సికింద్రాబాద్, కోఠి, లక్డీకాపూల్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.
ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరినవారు.. ఆఫీసుకు చేరుకునే సరికి 12 గంటలు అయ్యింది. ఈ లెక్కన ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏ స్థాయిలో జామ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్‌ని కంట్రోల్ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అధికారులు చర్యలు తీసుకోవడం ఈ సమయానికైనా వస్తున్నామని, లేకుంటే దారుణంగా ఉండేదని అంటున్నారు.
ALSO READ: కేటీఆర్‌కు కవిత బర్త్ డే విషెస్.. అన్నయ్యా అంటూ ఎమోషనల్ ట్వీట్
పలు ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ కావడం, మరికొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లపై నీరు నిలిచిపోవడం కనిపిస్తోంది. రోడ్లపై నీరు నిలవ ఉండకుండా కొన్నాళ్లుగా హైడ్రా చర్యలు చేపడుతూనే ఉంది. కాకపోతే డ్రైనేజీ పొంగి రోడ్లపై వరద నీరు చేరుతోంది. ఫలితంగా నగరవాసులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం.
మరోవైపు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విపత్తు ప్రతిస్పందన దళం-DRF, అత్యవసర బృందాలు-METలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచన చేశారు.
వరద ప్రభావిత, నీరు నిలిచి ఉన్న అనేక ప్రాంతాలను సందర్శించి ప్రధాన కాలువల పనులను సమీక్షించారు. ట్రాఫిక్ పోలీసులు-GHMC అధికారులతో మాట్లాడారు. నగర శివార్ల ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు. పాములు కనిపిస్తున్నాయనే ఫిర్యాదులు క్రమంగా పెరిగాయి.
శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, ఫ్యాక్టరీలు, విద్యాసంస్థల సమీపంలో పాములు కనిపించడం వల్ల నివాసితులు బెంబేలెత్తున్నారు. రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, జల్‌పల్లి, అత్తాపూర్, ఆరాంఘఢ్, కాప్రా, ఘట్‌కేసర్, నాగోల్, హయత్‌నగర్, పటాన్‌చెరు, కీసర, గచ్చిబౌలి, కోకాపేట్ తదితర ప్రాంతాల్లో పాములు ఇళ్లలోకి వస్తున్నాయని స్నేక్ రెస్క్యూ సిబ్బందికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలావుండగా వర్షాలు ముంచెత్తున్న వేళ పల్లపు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. వర్షం పడిన వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకురావద్దని సూచన చేశారు.