Heavy Rains: గత రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతాయని చెప్పింది. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
◙ జూలై 25న ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఇక రేపు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తెలంగాణ లో అక్కడక్కడ పిడుగలు పడే ఛాన్స్ కూడా ఉందని తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
◙ కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
◙ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి…
భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ALSO READ: AIIMS Recruitment: టెన్త్, ఇంటర్‌తో 3501 ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ మీదే బ్రో
◙ ఏపీలో కూడా భారీ వర్షాలు
అలాగే.. ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ALSO READ: Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లై చేశారా.. దరఖాస్తుకు ఇంకా వారం రోజలు..!