Heavy Rains: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. బయటికి వెళితే చాలు ప్రజలు మళ్లీ వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పడు కురుస్తున్న వర్షాలు సరిపోలేదన్నట్టు మళ్లీ మరో వారం రోజుల భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు మళ్లీ వర్షాలా.. అని బయపడుతున్నారు. అంతేకాకుండా నేడు తెలుగు రాష్ట్రాలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రజలు తొందరగా ఇళ్లలోకి వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలో భారీ వర్షాలు..
ఏపీలో మరో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించింది.. వాతావరణ శాఖ. ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడటంతో పాటు, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కొనసాగుతున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీలో మరో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని అంచనా వేసింది. వచ్చే 24 గంటల్లో ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది.. వాతావరణశాఖ.
తెలంగాణని వీడని వానగండం..
తెలంగాణలో కూడా మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోటెత్తిన వరద
బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. పాలనురగలాంటి ధారలతో కనువిందు చేస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతానికి వరద పోటెత్తింది. జలపాతాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భద్రతా దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకున్నారు.
Also Read: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?
పరవళ్లు తొక్కుతున్న కృష్టా, గోదావరి..
భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇన్‌ఫ్లో దాదాపు 3 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 3.37 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇక నాగార్జునసాగర్ నుంచి 26 గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడిచిపెడుతున్నారు. అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌లోని విద్యుత్ కేంద్రాల నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు.