BigTV English

Congress: వర్ధన్నపేట ఎమ్మెల్యేకి కొత్త కష్టాలు..

Congress: వర్ధన్నపేట ఎమ్మెల్యేకి కొత్త కష్టాలు..

Congress: ఇంటి దొంగను గుర్తించకపోతే.. ఇల్లు గుళ్ళ అవుతుంది. నాయకులు తమ చుట్టూ ఉన్న కంత్రీ గాళ్లను గుర్తించకపోతే, వారి పొలిటికల్ లైఫ్ ఆగమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారంట. ఆ ఎమ్మెల్యే చుట్టూ చేరిన అనుచరగణం తీరుతో ఆయన అభాసుపాలవుతున్నారట. ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే నాగరాజుకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన చుట్టూ జరుగుతున్న గూడుపుఠాణి ఏంటి..?


వర్ధన్నపేటలో ఆరూరి రమేష్‌పై విజయం సాధించిన నాగరాజు

వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన తొలి ప్రయత్నంలోనే బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్‌తో తలపడి గెలిచారు. దాంతో తర్వాత చాలామంది ద్వితీయ శ్రేణి బీఆర్ఎస్ నాయకులు నాగరాజు చెంతన చేరారు. ఎన్నికల ముందు నుంచి నాగరాజు గెలుపు కోసం పని చేసిన నేతలను కాదని తామే అన్నింటా ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న నాగరాజును వలస నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఎమ్మెల్యే తమ మాట జవదాటడని చెప్తూ.. ఇష్టారీతిన సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయట. పర్వతగిరి మండలానికి చెందిన ఓ నాయకుడు తన గ్రామంలోని సివిల్ పంచాయతీలలో తల దూర్చి ఇరువర్గాల నుండి లక్షల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో వసూలు చేస్తున్నారట. మరోవైపు నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ఎస్సైలు సైతం నిబంధనలను అతిక్రమించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలో వినిపిస్తున్నాయట.


వర్ధన్నపేటలో ఓ ఎస్ఐపై కమిషనర్‌కు ఫిర్యాదు

ఎమ్మెల్యే నాగరాజు పోలీస్ కమిషనర్ గా రిటైర్ కావడం, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంబంధాలు ఉండడంతో… తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో కొంతమంది ఎస్ఐలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారట. వర్ధన్నపేటలో ఓ ఎస్ ఐ, తన పరిధిని అతిక్రమించి స్టేషన్‌కు వచ్చిన బాధితులను బెదిరించడం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పోలీస్ కమిషనర్ కి వరుస ఫిర్యాదులు వెళ్లాయట. దీంతో కొద్ది రోజుల క్రితమే ఆ ఎస్సైపై వరంగల్ పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు. పర్వతగిరి సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మరో ఎస్సై అక్రమ ఇసుక రవాణాకి వంత పాడుతూ.. నెలవారి వసూళ్లు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయట. ఎమ్మెల్యే నాగరాజు తమ డిపార్ట్‌మెంట్ నుండే వచ్చారు కాబట్టి…తాము ఏం చేసినా, అడిగేవారు లేరని ప్రచారం చేసుకుంటుండడంతో బాధితులు ఎవరు ఎమ్మెల్యేకు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు సాహసించడం లేదనే టాక్ వినిస్తోంది.

నాగరాజు గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అనుచరులు

గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కొండేటి శ్రీధర్ అనుచరులుగా పనిచేసిన హసన్పర్తి, పర్వతగిరి, మడికొండ మండలాలకు చెందిన కొత్తపల్లి నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యే నాగరాజు అనుచరులుగా మారిపోయారు. కొండేటి శ్రీధర్ వెనకే ఉంటూ అక్రమాలకు పాల్పడి కోట్లల్లో వెనకేసుకున్న ఆ నేతలు ఐదేళ్లలో.. కొండేటి శ్రీధర్ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టారనే టాక్ నియోజకవర్గంలో ఉందట. ప్రస్తుతం ఆ నాయకులే ఇప్పుడు నాగరాజు చెంతన చేరారని కాంగ్రెస్ పార్టీ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. పర్వతగిరి మండలానికి చెందిన ఓ నాయకుడు సెటిల్మెంట్ల దందాకు తెరలేపి, ఎమ్మెల్యేని కూడా పంచాయతీలు చేయమంటురని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పంచాయతీ సెటిల్ కావాలంటే… తాను చెప్పినన్ని డబ్బులు ముట్ట చెప్పాలని బెదిరింపులకు దిగుతున్నారట. ఓ నాయకుడు గత ఆరు నెలల కాలంలోనే పంచాయతీ జమానత్ పేరుమీద బాధితుల వద్ద 80 లక్షలకు పైగా వసూలు చేశారట. మరో నాయకుడు, అమాయకుల ఇండ్ల స్థలాలను అసైన్డ్ భూములు అని బెదిరిస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట. ఈ విషయంపై కొంతమంది బాధితులు స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు సైతం చేశారు. అయితే ఇలాంటి వారు ఎమ్మెల్యే సపోర్టుతోనే ఇలా బరితెగించారని గ్రామాలలో చర్చ జరుగుతుంది.

అక్రమాలు ఎమ్మెల్యేకి తెలియదంటున్న కాంగ్రెస్ శ్రేణులు

నియోజకవర్గ వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తున్న సెటిల్మెంట్లు, ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి రావట్లేదని.. బాధితులు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వస్తే, ఆ నాయకులను పార్టీలోంచి వెళ్లగొడతారని కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కానీ, తన పేరు బదనాం చేస్తున్న నాయకుల గురించి ఎమ్మెల్యే నాగరాజుకు చెప్పేందుకు మాత్రం నాయకులు ససేమిరా అంటున్నారట. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు ఎమ్మెల్యే దృష్టికి రాకపోవడంతోనే కొంతమంది జాదూగాళ్లు గ్రామాలలో రెచ్చిపోతున్నారని సీనియర్ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

Also Read: బయటకు రాకండి.. మరో వారం రోజులు అత్యంత భారీ వర్షాలు..

తొలిసారి ఎమ్మెల్యే కావడంతోనే ఎవరిని నమ్మాలో, ఎవరిని తన అనుచరులుగా చేర్చుకోవాలో తెలియక ఎమ్మెల్యే సతమతమవుతున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇదే అదనుగా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు, అధికారులు తమ ఇష్టా రీతిన ప్రవర్తిస్తూ.. ఎమ్మెల్యే నాగరాజు పేరును డీ-ఫేం చేస్తున్నారని అంటున్నారు. ఆ క్రమంలో ఇటీవల ఓ నాయకుని అక్రమ వసూళ్ల దందాపై బాధితులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో… అతనిని దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. జనహిత పాదయాత్ర కార్యక్రమానికి సైతం ఆ నాయకుని దూరంగా పెట్టారట. ఈ ఘటనతో నియోజకవర్గంలోని గ్రామాలలో జరుగుతున్న విషయాలు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లట్లేదని అందుకే కొంతమంది నేతలు గ్రామాలపై పడి దోచుకుంటున్నారని తాజాగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే తన చుట్టూ ఉన్న నాయకుల వ్యవహార శైలిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. లేకుంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఎమ్మెల్యే పేరుని బదనాం చేసి, ఆయన పొలిటికల్ కెరీర్ ని డామేజ్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు సలహాలిస్తున్నారు.

Story By Rami Reddy, Bigtv

Related News

Telangana Politics: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?

Kothagudem Congress: కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా?

Jani Master: బిగ్ బాస్‌లోకి జానీ మాస్టర్ అసిస్టెంట్… ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే

AP Politics: కొత్త కార్యచరణతో దూకుడు పెంచాలని చూస్తున్న జగన్.. ఎందుకంటే!

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

Big Stories

×