Telangana News: కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో కేసీఆర్-హరీష్‌రావులకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు.
కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. దానిపై కేసీఆర్-హరీష్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ మొదలైంది. పిటిషనర్లు తరపు వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, శేషాద్రి నాయుడు.
తొలుత దీనిపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించామని తెలిపారు. సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుందని, ఇంకా ఇలాంటి యాక్షన్ జరగలేదని వివరించారు.
తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని పేర్కొంది. దీంతో తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది న్యాయస్థానం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ అసెంబ్లీలో దాదాపు 9 గంటలపాటు చర్చ జరిగింది. దీనిపై వివిధ పార్టీల సభ్యుల నివేదికపై సభలో మాట్లాడారు.
ALSO READ: కవిత మేటర్ కేసీఆర్ చేతుల్లో.. మళ్లీ అదే ఫార్ములా
చివరకు ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐ చేత దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. పరిస్థితి గమనించిన కేసీఆర్-హరీష్‌రావులు సోమవారం ఉదయం హైకోర్టులో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై ఇప్పుడు వాదనలు వినాలని ధర్మాసనం ముందు పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆయా పిటిషన్లను మంగళవారం విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. అన్నట్లుగా మంగళవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది.
దీనిపై సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ మాట్లాడారు. కమిషన్ దాదాపు 20 నెలలకు పైగా అన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిందన్నారు. 8 బీ కింద మాకు నోటీసులు ఇవ్వలేదన్నది పిటిషన్ల వాదన. సీబీఐ విచారణ అనేది అసెంబ్లీ నిర్ణయం తీసుకుందన్నారు. ఎఫ్ఐఆర్ అనేది సహజమని, అది వద్దని న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందన్నారు.