Husnabad Road Accident: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న మున్సిపల్ వాహనాన్ని బైక్ వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
షాపింగ్ మాల్ వద్ద ఊహించని ప్రమాదం
హుస్నాబాద్–హనుమకొండ ప్రధాన రహదారిపై ఉన్న కళ్యాణమస్తు షాపింగ్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చెత్త సేకరణ ప్రక్రియలో భాగంగా మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్ రోడ్డు పక్కన ఆగి ఉంది. అదే సమయంలో ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు వేగంగా వస్తూ.. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు.
ఇద్దరు అక్కడికక్కడే..
ఢీకొట్టిన తీవ్రతకు బైక్‌పై ఉన్న శ్రీకాంత్, నరసింహ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీరిద్దరూ హుస్నాబాద్ పట్టణానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అదే వాహనంపై ప్రయాణిస్తున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో.. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం అపరిమిత వేగంతో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేక రోడ్డుపై హెచ్చరికలు లేకుండా ట్రాక్టర్ ఆపి ఉంచడం కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Also Read: రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి