Hyderabad traffic jam: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని పూర్తిగా జలమయం చేశాయి. ముఖ్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన అతి భారీ వర్షానికి నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. వీధులు చెరువుల్లా మారిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అమీర్‌పేట్ – కదలని ట్రాఫిక్.. నీటిలో మునిగిన వీధులు
అమీర్‌పేట్ ప్రాంతంలో వరద నీరు చేరింది. రోడ్లపై నిలిచిన నీటితో బస్సులు, బైకులు, కార్లు ముందుకు సాగలేని పరిస్థితి. పలు వాహనాలు వరదలో ఆగిపోయాయి. డ్రైనేజీస్ పూర్తిగా బ్లాక్ కావడం వల్ల నీరు రోడ్లపైకి వచ్చింది. ఎక్కడికక్కడే ప్రజలు తమ వాహనాలతో నిలిచిపోయారు.
పంజాగుట్ట రోడ్డుపై ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల సూచనలు ఇవే
ఇదే సమయంలో పంజాగుట్ట రోడ్డుపై పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. లక్డికాపూల్ నుంచి పంజాగుట్ట వైపు ప్రయాణించవద్దని, బంజారాహిల్స్ నుండి తాజ్ డెక్కన్, పంజాగుట్ట వైపు వెళ్లకుండా ఉండాలన్నారు. ప్రజలు అల్టర్నేట్ రూట్స్ వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు వీలైనంతవరకూ ట్రిప్‌ను పోస్ట్‌పోన్ చేయాలని, అత్యవసరమైతేనే ప్రయాణించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే పలుచోట్ల డైవర్షన్లు అమలు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో సహాయక చర్యలు పెంపు
హైదరాబాద్ శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు స్వయంగా లోతట్టు ప్రాంతాల్లో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. రాత్రంతా వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలెవరూ బయటకు రావద్దని స్పష్టంగా హెచ్చరించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నీళ్లు నిలిచే ప్రాంతాల మ్యాపింగ్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ యాక్షన్‌లోకి
GHMC ఇప్పటికే తమ కంట్రోల్ రూమ్‌ను 24 గంటల పాటు యాక్టివ్‌గా ఉంచింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అదనపు సిబ్బంది మోహరించబడింది. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద డివిజన్ వారీగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది అధికారులు స్వయంగా స్పాట్‌కు వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Hyderabad flood alert: హైదరాబాద్ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!
రాత్రి వేళ మరింత జాగ్రత్త అవసరం.. వాతావరణ శాఖ హెచ్చరిక
వాతావరణ శాఖ ప్రకారం రాత్రి వేళ వర్షం మరింత ఉధృతమవుతుందని అంచనా. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవొచ్చని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా లోతట్టు కాలనీలు, నదీ తీర ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలి.
వాహనదారులకు, ప్రజలకు సూచనలు:
అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ రూట్‌లకు వెళ్లకుండా ఉండండి
ట్రాఫిక్ డైవర్షన్‌లను గౌరవించండి
నీరు నిలిచిన చోట బైకులు నడపవద్దు
అనవసర ప్రయాణాలు మానుకోండి
అవసరమైతేనే బయటకు వెళ్లండి
విద్యుత్ లైన్లు, ఓపెన్ మానహోల్స్‌కు దూరంగా ఉండండి
అధికారుల సూచనలకు అనుగుణంగా ప్రవర్తించండి
100 లేదా 040-21111111 కు కాల్ చేసి సహాయం పొందండి
సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణ
సీఎం రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో రాత్రంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు అత్యంత ప్రాధాన్యం అని, ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే స్పందించాలన్నారు. ఈ వర్షం సాధారణం కాదు. ఇది నగరానికి ఓ పరీక్షగా మారింది. జాగ్రత్తలుంటే ప్రమాదం ఉండదు. కానీ బాధ్యత లేని ప్రవర్తన ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా, శాంతంగా, అధికారుల సూచనల మేరకు వ్యవహరించాలి.