Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల కోసం పోలీసులు సర్వ సన్నద్దమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా సాగేందుకు ఏకంగా 28 వేల పోలీసులతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 24 డ్రోన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 40కి పైగా భారీ క్రేన్లను సిద్ధం చేశారు.
మరోవైపు బాలాపూర్, ఖైరతాబాద్ గణనాథులు మరికొద్ది గంటల్లో గంగమ్మ ఒడిలోకి చేరుకోనున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకూ 18 కి.మీ మేర శోభయాత్ర జరగనుంది. అటు ఖైరతాబాద్ భారీ గణనాథుడి యాత్రకు పోలీసులు భారీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హుస్సేన్ సాగర్ తీరానికి ఖైరతాబాద్ గణేశ్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలలోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రక్రియ పూర్తి కానుంది.
Also Read: ఖైరతాబాద్ ఉపఎన్నిక.. రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం.. దానం ప్రభావంపై ఆరా!
అయితే ఖైరతాబాద్ గణనాథుడు రాక నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్ వైపు గణేష్ నిమర్జనాలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయ్యేవరకు ఈ మార్గంలో నిమజ్జనాలు ఆగిపోయాయి. ఖైరతాబాద్ గణనాథుని నిమర్జనం అనంతరం తిరిగి ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో గణేశ్ నిమజ్జనాలు తిరిగి ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం వినాయక సాగర్ ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్ల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
మరోవైపు నిమజ్జన రూట్ లో ఎప్పటికపుడు చెత్త, వ్యర్థాల సేకరణ కోసం 1,356 మంది పారిశుద్ధ్య సిబ్బందితో 24 గంటల సేవలు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 168 గణేష్ యాక్షన్ టీమ్స్ పనిచేస్తున్నాయి. 13 సర్కిళ్ల పరిధిలోని 56 ఊరేగింపు మార్గాల్లో ఆ టీమ్స్ మోహరించి ఎప్పటికప్పుడు వ్యర్థాలను సేకరిస్తున్నాయి. సేకరించిన చెత్తను మినీ టిప్పర్లు, జేసీబీల ద్వారా యార్డుకు తరలించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read: దానం అవుట్.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకటే టెన్షన్!