MLA Defection: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి వేడెక్కింది. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌తో కలిసి సాగుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో మిగతా కేసులపైనా అందరి దృష్టి పడింది. 2024 సెప్టెంబరు 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా హైకోర్టు ప్రకటించగా సుప్రీంకోర్టు సైతం ఇదే తీర్పును సమర్ధించింది. దీంతో మిగిలిన కేసుల్లోనూ ఇదే తరహా న్యాయపరమైన పరిశీలన జరుగుతుందా? అన్న చర్చ మొదలైంది.
దానం నాగేందర్ తర్వాత తదుపరి పరిణామాలు ఎవరిపై ఉంటాయన్న చర్చలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు ముందుకొస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్‌లో చేరినట్లు బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ అంశంపై హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసింది. ఆ సమయంలో ఎంపీ అభ్యర్ధిని బలపరుస్తూ చేసిన సంతకాల్లోనూ శ్రీహరి పేరు ఉండటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ కు ఓటువేయాలని కోరిన వీడియోలను కోర్టుకు సమర్పించినట్లు గులాబీ నేతలు తెలిపారు. 2026 మార్చిలో స్పీకర్ ఆ పిటిషన్‌ను కొట్టివేసినా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతోంది.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కూడా బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీ పీఏసీ చైర్మన్ పదవీ ఇవ్వాలని చట్టాల్లో ఉందని, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నవారికి పార్టీ ప్రతిపాదించిన ఎమ్మెల్యేకే చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉందని నేతలు పేర్కొంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపాదనలను తీసుకోకుండానే గాంధీని ఎంపిక చేసిందని హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరుపున పాల్గొన్నారని అందుకు సంబంధించిన వీడియోలను సైతం కోర్టుకు అందజేశామని తెలిపారు. కడియం తర్వాత అరికెపూడి గాంధీ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు వచ్చాయి. దానం నాగేందర్ విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత మిగిలిన కేసులను కూడా బీఆర్‌ఎస్ వర్గాలు నిశితంగా అనుసరిస్తున్నాయి. టి.ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, పొచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎం.సంజయ్‌కుమార్ తదితరులపై దాఖలైన పిటిషన్లలో స్పీకర్ నిర్ణయాలను సవాలు చేస్తూ కేసులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వ్యవహారం ప్రత్యేకంగా నిలుస్తోంది. గతంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం బీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నాటి నుంచి యాక్టీవ్ గా గులాబీలో తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఎమ్మెల్యేల జాబితాలోనూ ప్రస్తుతం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ సభ్యుడిగా నమోదై ఉన్నారు.పార్టీ సైతం ఆయనను తిరిగి బీఆర్ఎస్ లో యాక్సెప్ట్ చేసింది.
దానం నాగేందర్‌పై తీర్పు తర్వాత బీఆర్‌ఎస్ శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా.. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో మాత్రం న్యాయపరమైన పరిణామాలపై ఉత్కంఠ పెరిగింది. దానం కేసులో హైకోర్టు అనుసరించిన విధానం మిగిలిన కేసుల్లోనూ చర్చకు వస్తోంది.ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో ‘ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు?’ అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: యాపిల్ కొనేముందు తీయగా, జ్యూసీగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ
అక్టోబరు 6న హైకోర్టులో జరగనున్న తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానం నాగేందర్ కేసులో హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్, ఆర్టికల్ 191(2) ప్రకారం అనర్హత వర్తిస్తుందని సెప్టెంబరు 18న వెలువడిన తీర్పు నేపథ్యంలో మిగిలిన ఫిరాయింపు కేసుల్లో న్యాయస్థానం ఏ విధమైన దిశను చూపుతుందన్నది కీలకంగా మారింది.ఒకవైపు బీఆర్‌ఎస్ మిగిలిన కేసులను ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా.. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అక్టోబరు 6 నాటి న్యాయపరమైన పరిణామాలతో ఈ వ్యవహారంలో తదుపరి అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
Also Read: మృణాల్ ఠాకూర్ ఫేవరేట్ మూవీ… బ్రేకప్ తర్వాతే అసలు కథ మొదలైతే? ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా