Hyderabad Skywalk: హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ టెక్, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని కీలక ప్రదేశంగా చూస్తున్నాయి. తమ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర జనాభా, ట్రాఫిక్, వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కీలక నిర్ణయం తీసుకుంది.
నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కూకట్‌పల్లి JNTU జంక్షన్ వద్ద కొత్తగా స్కైవాక్‌లను నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించే సికింద్రాబాద్ స్కైవాక్ రైల్వే స్టేషన్, బస్టాండ్, మెట్రో సేవలతో అనుసంధానించనున్నారు. దీంతో ప్రయాణికులు రద్దీగా ఉండే రోడ్లపైకి అడుగు పెట్టకుండానే తమ రవాణా మార్గాలకు చేరుకోవచ్చు.
కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద సుమారు 600 మీటర్ల స్కైవాక్ ను మెట్రో స్టేషన్ నుంచి లులు మాల్ వరకు నిర్మించనున్నారు. జేఎన్టీయూ నుంచి మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి లులు మాల్ వరకు స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నారు. స్కైవాక్ ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ నియంత్రణ, పాదచారుల రాకపోకలకు సహాయపడుతుంది. నగరంలో రవాణా కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ప్రమాదాలను తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు HMDA తెలిపింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పాదచారుల ఇబ్బందులను తొలగించేందుకు హెచ్ఎండీఏ స్కైవాక్ ప్రతిపాదన చేసింది. ఈ ఏడాది మే నెలలోనే ఎలివేటెడ్ వాక్‌వే ప్రాజెక్టును అమలు చేయడానికి కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నగరంలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడి నుంచి నిత్యం వేల సంఖ్య ప్రయాణికులు ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తుంటారు. దీంతో స్టేషన్ చుట్టు పక్కల తీవ్ర రద్దీ ఉంటుంది. రైళ్లు వచ్చిన సమయాల్లో ప్రయాణికులు వారి కోసం వచ్చిన ఆటోలు, క్యాబ్ లు, ఇతర వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది.
రైల్వే స్టేషన్ వెలుపల బస్ స్టాండ్ ఉండడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. రద్దీ సమయాల్లో స్టేషన్ నుంచి బయటకు వచ్చి బస్ ఎక్కాలంటే కాస్త శ్రమతో కూడుతున్న ప్రయత్నమే చేయాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు సికింద్రాబాద్ లో స్కైవాక్ నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. స్కైవాక్ ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, భద్రతా సమస్యలకు దోహదం చేస్తుందని ప్రయాణికులు భావిస్తున్నారు.
Also Read: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్‌అండ్ టీ తప్పుకోలేదు.. ఇది కేసీఆర్ కుట్ర, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నిర్మించిన స్కైవాక్ పాదచారులకు ఎంతో ఉపయోగపడుతుంది. రోడ్డు దాటడానికి మాత్రమే కాకుండా, కూర్చునేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాఫీ సెంటర్లు, ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సాయంత్రం సమయాల్లో ఇక్కడ సేదతీరే వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే మెహదీపట్నం వద్ద నిర్మిస్తున్న స్కైవాక్ పై కూడా ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కైవాక్ నిర్మాణం కూడా పూర్తికావచ్చింది.