Hyderabad Global Hub: స్వేచ్ఛ బ్యూరో: సమర్థవంతమైన పాలన, వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పారిశ్రామిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు నిలయంగా మారింది. గ్లోబల్ ఐటీ, ఆర్థిక, పారిశ్రామిక పటంలో రాజధాని హైదరాబాద్ వేగంగా దూసుకుపోతున్న తీరుపై అంతర్జాతీయ ప్రముఖ ఆర్థిక మీడియా సంస్థ ‘బ్లూమ్‌బెర్గ్’ప్రత్యేకంగా ప్రశంసించింది. బ్లూమ్‌బెర్గ్ గుర్తించిన ఈ ప్రగతిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం తన ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
నగరంలో శాశ్వత స్థావరాలు ఏర్పాటు
గత రెండేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన దార్శనిక పాలన, స్పష్టమైన ప్రణాళికలే ఈ ఘనతకు కారణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సానుకూల పారిశ్రామిక వాతావరణం, సులభతర వాణిజ్య విధానాల కారణంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న పలు బహుళజాతి సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు, గ్లోబల్ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి క్యూ కడుతున్నాయని సీఎం వివరించారు. ముఖ్యంగా వినోదం, హెల్త్‌కేర్, బ్యూటీ కేర్ , ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన దిగ్గజాలు నగరంలో శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు.
గ్లోబల్ కార్పొరేట్ హబ్‌గా తన రూపాంతరం
గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్ , వార్నర్ బ్రదర్స్ – డిస్కవరీ లు హైదరాబాద్ లో చేరుకున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యూటీ టైటాన్ లోరియల్ రానున్నదన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేసే ఆమెజాన్, ఎలీ లిల్లీ వంటి సంస్థలు ఉన్నాయన్నారు. నిత్యవసర ఉత్పత్తుల తయారీ సంస్థ యూనిలీవర్ కూడా వచ్చేస్తుందన్నారు. ఈ సంస్థల ఆగమనంతో హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, విభిన్న రంగాల గ్లోబల్ కార్పొరేట్ హబ్‌గా తన రూపాంతరం చెందిందని సీఎం పేర్కొన్నారు.
100 కొత్త జీసీసీల లక్ష్యం..
ఈ ఆర్థిక సంవత్సరంలో నగరంలో కొత్తగా 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను నెలకొల్పడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని సీఎం వివరించారు. ప్రవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన చురుకైన విధానాలు, గ్రౌండ్ వర్క్ కారణంగా ఈ లక్ష్య సాధన నిర్దేశిత గడువు కంటే వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచస్థాయి కంపెనీలు తమ ఆర్ అండ్ డి , టెక్నాలజీ సెంటర్ల కోసం హైదరాబాద్‌నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీ తో సరికొత్త చరిత్ర..
ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక, సాంకేతిక ఆవరణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.‘‘ప్రపంచ శ్రేణి కంపెనీల సాంకేతిక అవసరాలకు, తెలంగాణలోని నైపుణ్యమున్న యువతకు ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడుతుంది.వేలాది మంది స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు, ఉన్నత ఉపాధి మార్గాలు సుగమమవుతాయి.అంతేగాక పరిశోధనలు, సరికొత్త ఐటీ ఆవిష్కరణలకు నగర వేదిక కానుంది.తెలంగాణ ఇకపై కేవలం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే స్థాయికి పరిమితం కాలేదు. భారతదేశ భవిష్యత్తును, అంతర్జాతీయ వ్యాపార గమనాన్ని శాసించే స్థాయి అవకాశాలను, నైపుణ్యాలను మేమే స్వయంగా సృష్టిస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం.. పోలీసుల ఉద్యోగాల పేరిట లక్షల వసూలు