Hyderabad traffic: హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ, సిగ్నల్ ఫ్రీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు క్యూర్ సిటీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులపై సర్కారు మౌఖిక ఆదేశాల మేరకు కార్పొరేషనర్ల కమిషనర్లు స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెల్సింది. ముఖ్యంగా నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టున్న ఆరు జంక్షన్లతో పాటు పార్కు చుట్టూ రూ. 1090 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల పనులు మున్ముందు మరింత స్పీడప్ కానున్నట్లు తెలిసింది. పార్కు చుట్టు మొత్తం 345 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాల్సి ఉండగా, వీటిలో ఇప్పటి వరకు దాదాపు సగం ఆస్తుల నుంచి స్థలాలను సేకరించే ప్రక్రియ తుది దశలో ఉన్నపుడే జీహెచ్ఎంసీ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనులు మొదలుపెట్టిన సంగతి తెల్సిందే.
కేబీఆర్ పార్కు చుట్టూ..
స్థలాలు ఇవ్వాల్సిన యజమానుల్లో కొందరు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్) లకు అంగీకరించకపోవటంతో వారికి కూడా పరిహారం చెల్లించి స్థలాలను సేకరించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. అంతలోపు స్థల సేకరణ అవసరం లేని, సర్కారు భూమి ఉన్న చోట జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లై ఓవర్ల పిల్లర్ల పనులను, అండర్ పాస్ కోసం తవ్వకాలను మొదలు పెట్టారు. కేబీఆర్ పార్కు చుట్టూ పనులను మరింత వేగవంతం చేసేందుకు గాను ఈ నెల 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వేను అమలు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఇప్పటికే కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతూ ట్రాఫిక్ పోలీసులు బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ నెలు 18వ తేదీ నుంచి వన్ వే అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం పార్కు చుట్టూ అండర్ పాస్, ఫ్లై ఓవర్ల పనులు డైలీ మూడు షిఫ్టులుగా రౌండ్ ది క్లాక్ నిర్వహించాలని పనులు నిర్వహిస్తున్న మెగా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ సంస్థను జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించిన సంగతి తెల్సిందే. ఎనిమిది గంటలకు ఓ షిఫ్టు చొప్పున మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు
ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి రాకపోకలు మరింత వేగంగా సాగేందుకు వీలుగా సైదాబాద్ లో రూ. 645 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం తుది దశలో ఉండటంతో వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జి, తో పాటు అంబర్ పేట నుంచి మలక్ పేట మధ్య మూసీపై రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మిస్తున్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను కూడా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ఈ రెండు ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్త గూడలో చేపట్టిన ఫ్లై ఓవర్ పనులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్న కమిషనర్ సృజన నిర్ణీగ గడువులోపు పనులు పూర్తి కావాలని డెడ్ లైన్ విధించి సంగతి తెల్సిందే.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్..
నిర్ణీత గడువు దాటిన తర్వాత పనులు చేపట్టాల్సి వస్తే నిర్మాణ సంస్థకు జరిమానాలు చెల్లించక తప్పదని కమిషనర్ హెచ్చరిక జారీ చేయటంతో నిర్మాణ సంస్థ పనులను స్పీడప్ చేసింది. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ రెండు రోజుల క్రితం పనులను పర్యవేక్షించిన సందర్భంగా నిర్మాణ సంస్థను ఆదేశించారు. క్యూర్ సిటీ పరిధిలోని మొత్తం రూ. 7 వేల కోట్ల వ్యయంతో అయిదు ప్యాకేజీలుగా మొత్తం 23 హెచ్ సిటీ పనులకు సర్కారు పరిపాలపరమైన ఆమోదం ఇప్పటికే ఇవ్వటంతో స్థల సేకరణ ప్రక్రియలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే ప్రక్రియ పూర్తి చేసి పనులను మొదలుపెట్టాలని, ఇప్పటికే మొదలు పెట్టిన హెచ్ సిటీ పనులను రౌండ్ ది క్లాక్ పనులు చేస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సర్కారు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
నవంబర్ కల్లా పనులు విజిబులిటీ స్థాయికి రావాలి..
ఏడు నెలల క్రితం కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో వీలినం చేయటంతో పెరిగిన విస్తీర్ణాన్ని ఆరు నెలల క్రితం మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీలో పాలక మండలి గడువు గత ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసింది. తిరిగి మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు నవంబర్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించాలని, అందుకు జీహెచ్ఎంసీ సిద్దంగా ఉండాలని సర్కారు ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంకేతాలిచ్చిన నేపథ్యంలో నవంబర్ నెల ప్రారంభం కల్లా కేబీఆర్ చుట్టూ ఏడు అండర్ పాస్ లు, మరో ఏడు ఫ్లై ఓవర్ల పనులు ప్రజలకు అర్థమయ్యేలా విజుబిలిటీ స్థాయికి తీసుకురావాలని సర్కారు జీహెచ్ఎంసీని ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో కేబీఆర్ పార్కు చుట్టు ఏం పనులు జరుగుతున్నాయి? పనులు పూర్తయిన తర్వాత అందుబాటులోకి రానున్న స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నమూనాలను పనులు జరుగుతున్న ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ ను మళ్లిస్తున్న జంక్షన్లలో నమూనాలను రాకపోకలు సాగించే వాహనదారులకు కన్పించేలా ప్రదర్శించారు.
Also Read: టీజీఎస్పీడీసీఎల్‌ల్లో వసూళ్ల రికార్డు.. 4 నెలల్లో ఏంత చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!