Ramchander Rao: స్వేచ్చ బ్యూరో: ఓటమి భయంతో రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎదురవుతున్న వరుస ఎన్నికల పరాజయాలను తట్టుకోలేక, ప్రజాతీర్పును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానిస్తోందని మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో వరుసగా మూడు పర్యాయాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించి, మోడీని మూడోసారి ప్రధానిగా ఆశీర్వదించడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోందని పేర్కొన్నారు. ప్రధాని పీఠం కేవలం నెహ్రూ-గాంధీ కుటుంబానికి మాత్రమే సొంతమనే రాచరికపు అహంకారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఒక సామాన్య చాయ్‌వాలా ప్రధాని పదవిని చేపట్టి విజయవంతంగా పరిపాలన సాగించడాన్ని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
దేశంలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని, వాటిని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడటం భారత ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును వినియోగించుకున్న కోట్ల మంది పౌరుల విచక్షణను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి శక్తులు ఏకమై భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీం కోర్టు), రాష్ట్రపతి కార్యాలయం, భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) వంటి రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఈ విధంగా వ్యవస్థలను బలహీనపరిచి దేశ సమగ్రతకు భంగం కలిగించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.
ఈ ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమే నిర్వహిస్తోందని, ఏవైనా అభ్యంతరాలుంటే వాటిపై ఎన్నికల సంఘం క్షేత్రస్థాయి విచారణ జరిపిన తర్వాత మాత్రమే ఓట్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఫామ్-7 సమర్పించినంత మాత్రాన ఓట్లు తొలగించినట్లు కాదని, దొంగ ఓట్లు, నకిలీ ఓట్ల ఏరివేత కోసమే నిబంధనల ప్రకారం ఫామ్-7 విధానం ఉందని గుర్తుచేశారు. పైగా బీజేపీకి చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ-1, బీఎల్ఏ-2) ఎవరూ కూడా అటువంటి దరఖాస్తులు సమర్పించలేదని స్పష్టం చేశారు. విచారణ దశలోనే ఉన్న అంశంపై ఇప్పుడే ఓట్లు తొలగించేస్తున్నారంటూ కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం పూర్తిగా అభ్యంతరకరమని అన్నారు. ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలు, ఎస్ఐఆర్ ప్రక్రియలపై నిందలు వేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
Also read: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!
కేరళ వంటి రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రశంసించిన ఆ పార్టీ నేతలు, ఓడిపోయే చోట మాత్రం బురదజల్లుతున్నారని ఆక్షేపించారు. దేశంలో ఇప్పటికే అధిక భాగం కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏర్పడిందని, మిగిలిన రెండు మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను భారత ప్రజలు ఎక్కడికక్కడ తిప్పికొడతారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని రాంచందర్ రావు హెచ్చరించారు.
Also read: విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?