నగరం నలువైపులా విస్తరిస్తున్న ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) కొరడా ఝుళిపించింది. భారీ ఆపరేషన్లతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను స్వాధీనం చేసుకుంది. ప్రధానంగా ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న విలువైన చెరువును కబ్జాకోరల నుంచి విముక్తి చేయడంతో పాటు రహదారుల ఆటంకాలను తొలగించింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో అస్తిత్వమే కోల్పోయే స్థితికి చేరిన నాగిరెడ్డి కుంటను హైడ్రా రక్షించింది. సుమారు 8.24 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువును బడా నిర్మాణ సంస్థలు మాయం చేసేందుకు కుట్ర పన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ.. చెరువు చుట్టూ 20 అడుగుల ఎత్తైన టిన్ షీట్లను ఏర్పాటు చేసి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా గోడలు కట్టారు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 4 ఎకరాల వరకు ఫెన్సింగ్ వేయగా.. మరొక సంస్థ 3 ఎకరాలను ఆక్రమించింది. వీటితో పాటు స్థానిక మాజీ ప్రజాప్రతినిధి సైతం ఎకరం భూమిని ఆక్రమించి ఇతరులకు విక్రయించారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. భారీ యంత్రాలతో అక్కడి తాత్కాలిక గదులు, ప్రహరీ గోడలను కూల్చివేసింది. ప్రస్తుతం చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను అమర్చింది.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పరిధిలోని గండిమైసమ్మ–మియాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. బౌరంపేట గ్రామ పరిధిలో 150 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును ఆనుకుని ఒక వ్యక్తి అక్రమంగా షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చారు. వీటివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించిన హైడ్రా.. రెండు నెలల ముందే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించింది. మంగళవారం 10 వ్యాపార సముదాయాలను నేలమట్టం చేసి ప్రయాణికులకు మార్గం సుగమం చేసింది. ఈ చర్యలతో ట్రాఫిక్ కష్టాలు తీరాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అవుషాపూర్ గ్రామ పరిధిలో దశాబ్దాల క్రితం కేటాయించిన పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది. 1987లో వేసిన ఓ లేఅవుట్‌లో 1440 గజాల స్థలాన్ని పార్కు కోసం విడిచిపెట్టగా.. కొందరు వ్యక్తులు దానిని 6 ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నించారు. దీనిపై ప్రజానాడిలో ఫిర్యాదు అందగానే స్పందించిన అధికారులు.. విక్రయాలను అడ్డుకుని అక్కడ ఫెన్సింగ్ వేశారు. ఇది ప్రభుత్వ పార్కు స్థలమని పేర్కొంటూ బోర్డులు పెట్టారు.
మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్లలో కోట్లాది రూపాయల విలువైన భూములను హైడ్రా కాపాడింది. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. సకాలంలో స్పందించి చెరువులు, పార్కులను కాపాడటం పట్ల నగర ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ALSO READ: April Rules: ట్యాక్స్ నుంచి టికెట్ దాకా.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఈ కొత్త రూల్స్!