House Sale Fraud: స్వేచ్ఛ బ్యూరో: ఇల్లు విక్రయిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.31.77 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, అదే ఇంటిని మరో బ్యాంకులో తనఖా పెట్టి రూ.37 లక్షల రుణం పొందినట్లు ఓ మహిళపై ఆరోపణలు వచ్చాయి. బాధితుడికి ఇంటి రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే కేసుల పేరుతో బెదిరించినట్లు ఫిర్యాదు అందడంతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం మల్లారెడ్డి నగర్‌కు చెందిన గొలిపల్లి దయాకర్‌రెడ్డికి జగద్గిరిగుట్ట అంజయ్య నగర్‌కు చెందిన యెర్రోళ్ల రేణుకతో పరిచయం ఏర్పడింది. తన ఆర్థిక అవసరాల కోసం 60 చదరపు గజాల స్థలంలో నిర్మించిన జీ+2 భవనాన్ని విక్రయించనున్నట్లు ఆమె దయాకర్‌రెడ్డికి తెలిపింది. ఇంటి ధరను రూ.80 లక్షలుగా నిర్ణయించడంతో కొనుగోలుకు దయాకర్ అంగీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఇరువురి మధ్య విక్రయ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా దయాకర్‌రెడ్డి తన ఎస్‌బీఐ ఖాతా నుంచి మూడు చెక్కుల ద్వారా రూ.27 లక్షలు, నగదు రూపంలో మరో రూ.4.77 లక్షలు చెల్లించారు. మొత్తం రూ.31.77 లక్షలను అడ్వాన్స్‌గా ఇచ్చారు.
రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ చేస్తానని..
ఇంటి అసలు పత్రాలు చూపించాలని దయాకర్‌రెడ్డి కోరగా, ఆ భవనంపై ఇప్పటికే బ్యాంకులో రూ.18 లక్షల రుణం ఉన్నట్లు రేణుక తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్వాన్స్ డబ్బులతో ఆ రుణాన్ని తీర్చి, రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ సమయానికి అసలు పత్రాలు అందజేస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. గడువు ముగిసినా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో దయాకర్‌రెడ్డి ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలో తనపై తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు. చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో మార్చి 6వ తేదీ నాటికి డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పి చెక్కులు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరుసటి రోజే మరో బ్యాంకులో తనఖా!
అయితే, మార్చి 7న అదే ఇంటిని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో తనఖా పెట్టి మరో రూ.37 లక్షల రుణం పొందినట్లు బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన దయాకర్‌రెడ్డి జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రేణుకపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఎస్సై జి. శేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: తిరుపతికి చంద్రబాబు భారీ వరాలు.. రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!