Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం.. ఫేజ్-II విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సీఎం వరుసగా రెండ్రోజులు సమావేశమయ్యారు. తొలుత సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి మనోహర్ లార్ ఖట్టర్ నివాసంలో మరోమారు అంశంపై చర్చించారు.
ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్, అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక.. మెట్రో ఫేజ్-II విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా ఎస్బీఐ క్యాప్స్ ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-I వాల్యూయేషన్.. ఫేజ్-II విస్తరణ.. ఇతర అంశాలపై ఎస్బిఐ క్యాప్స్ సమగ్రంగా అధ్యయనం చేయనుంది.
ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేస్తారు.
Also Read: BSNL బంపరాఫర్.. కేవలం రూ.259కే.. అపరిమిత వై-ఫై కనెక్షన్!
ఇదిలా ఉంటే దిల్లీ టూర్ లో భాగంగా రక్షణ మంత్రితోనూ సీఎం రేవంత్ సోమవారం భేటి అయ్యారు. భారత వాయు సేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ భూసేకరణ, యూటిలిటీస్ బదలాయింపు తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: కిషన్‌రెడ్డి.. ఆటలో అరటిపండు! ఇగ నన్ను తిట్టవు గదా! నేనూ తెలంగాణ కోసమే ఆలోచిస్తున్నా తెలుసా!?