Hyderabad Metro: గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. రేపు (శనివారం) నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల నిమజ్జనానికి వెళ్లే భక్తులు, సాధారణ ప్రయాణికులు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమీక్షలు నిర్వహించామన్నారు. నగరంలోని ప్రధాన చెరువులు, నిమజ్జన కేంద్రాలను పరిశీలించామని, శనివారం నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వంటి ప్రాంతాల్లో మొత్తం 40 క్రేన్లు అందుబాటులో ఉంటాయని వివరించారు.
Also Read: Mumbai High Alert: గణేష్ నిమజ్జనం సందర్భంగా బాంబు బెదిరింపు.. నగర వ్యాప్తంగా హై అలర్ట్
ఎత్తు ఎక్కువగా ఉన్న వినాయక విగ్రహాలకు వాహనాల్లో తీసుకువచ్చే భక్తులు, పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నగరంలో ప్రతి చోటకు వెళ్లేందుకు రూట్ మ్యాప్, ట్రాఫిక్ డైవర్షన్‌ల ప్రాంతాల్లో బారికేడ్లు అమర్చామని వెల్లడించారు. ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనాన్ని మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో మండపాల నిర్వాహకులు గణేశుని విగ్రహాలతో ముందుగానే నిమజ్జనానికి బయలుదేరాలని సూచించారు. నగర వ్యాప్తంగా సుమారు 29వేల మంది పోలీసులు బందోబస్తు ఉంటుందని, ఒక్క రోజే 50వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనున్నట్లు వెల్లడించారు.
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ, నగరంలో 34 ప్రధాన చెరువులు, 64 ప్రాంతాల్లో ప్రత్యేక నిమజ్జన కేంద్రాలు సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 40 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదాల పంపిణీ, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. భక్తులు శాంతియుతంగా ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలతో సహకరించాలని వెల్లడించారు. హైదరాబాద్ నగరం ఈ శనివారం గణేశ్ నిమజ్జన శోభాయాత్రలతో నిండుగా ఉంటుందని తెలిపారు.