Nagole Murder: హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపిన దారుణమిది. నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం ప్రాంతంలో ఓ మహిళ అత్యంత ఘోరంగా హత్యకు గురైంది. బుధవారం ఉదయం ఆ వైపుగా వెళ్లిన మార్నింగ్ వాకర్స్, పొదల్లో పడి ఉన్న మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే నాగోల్ పోలీసులకు సమాచారం అందించారు.
కాళ్లు, చేతులు నరికి..
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ దృశ్యం చూసి వారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మహిళ కాళ్లు, చేతులు నరికివేసి ఉన్న స్థితిలో మృతదేహం పడి ఉంది. అంతేకాకుండా, సంఘటనా స్థలం పక్కనే మద్యం బాటిళ్లు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దుండగులు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై ఈ రకంగా అతి దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం..
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, హత్యకు గురైన మహిళ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. గత నెల 28న ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యమైనట్లు నమోదైన కేసుపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆ మిస్సింగ్ కేసుతో ఈ సంఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అన్ని ఆధారాలను సేకరిస్తూ నాగోల్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: నెల దాటినా పూర్తికాని పంట సర్వే.. ప్రభుత్వం విధించిన గడువు నీటిమూటలేనా?