Crop Survey: స్వేచ్ఛ బ్యూరో: రైతులు ఏ పంట సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ఏ సర్వే నంబర్‌లో ఏ పంట ఉంది? అనే వివరాలను నమోదు చేయాల్సిన డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నెల రోజుల గడువు విధించినా సర్వే పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, ఒక్కో సర్వే నంబర్ వద్దకు వెళ్లి వివరాలను నమోదు చేయాల్సిన నిబంధన, ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయడం, సర్వే నంబర్ల సబ్‌డివిజన్ల వారీగా వివరాలు నమోదు చేయాల్సి రావడం వంటి కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు థర్డ్‌పార్టీ సర్వే విధానం, వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా సర్వే చేయడంలో ఆలస్యం అవుతుందని సమాచారం.
గ్రామానికి ఒక్కరే..
ఏఈఓలకు ఇప్పటికే 40కి పైగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించడంతో పంటల సర్వే బాధ్యతలను విలేజ్ సర్వేయర్లకు అప్పగించింది. సాధారణ గ్రామానికి ఒకరు, మేజర్ గ్రామానికి ఇద్దరు చొప్పున సర్వేయర్లు ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఒక గ్రామంలోని మొత్తం సర్వే నంబర్లను గుర్తించి, వాటి వద్దకు వెళ్లి సాగులో ఉన్న పంటను పరిశీలించి, ఫొటో తీసి, యాప్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వే నంబర్లు అధికంగా ఉన్న గ్రామాల్లో ఇంత తక్కువ సిబ్బందితో నిర్ణీత గడువులో ప్రక్రియను పూర్తి చేయడం సవాల్‌గా మారుతోంది.
సర్వే నంబర్ దగ్గరకు వెళ్తేనే..
పంట సర్వేలో కీలకమైన అంశం క్షేత్రస్థాయి నమోదు. సంబంధిత సర్వే నంబర్ వద్దకు వెళ్లి అక్కడి పంటను పరిశీలించిన తర్వాతే యాప్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో సర్వేయర్ ఒకే గ్రామంలో ఉన్నా అన్ని సర్వే నంబర్లను ప్రత్యక్షంగా సందర్శించాల్సి వస్తోంది. భూములు విస్తరించి ఉండటం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఉండటం, ఒక నంబర్ నుంచి మరో నంబర్‌కు వెళ్లడానికి సమయం పడుతుండటంతో రోజువారీగా పూర్తయ్యే సర్వే నంబర్ల సంఖ్య పరిమితమవుతోంది. అంతేకాదు 20 మీటర్ల దూరంలో సర్వే నెంబర్ ఉంటేనే యాప్ ఓపెన్ అవుతుంది.అప్పుడే వివరాలను నమోదు చేయడం జరుగుతుంది.
ఫొటోకు రూ.7
ప్రతి సర్వే నంబర్ వద్ద పంట ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున చెల్లింపు ఉంటుందని సర్వే సిబ్బంది చెబుతున్నారు. ఫొటో తీయడం, యాప్‌లో అప్‌లోడ్ చేయడం, పంట రకాన్ని నమోదు చేయడం, విస్తీర్ణ వివరాలను నమోదు చేయడం వంటి దశలన్నీ పూర్తయిన తర్వాతే ఆ సర్వే నంబర్ నమోదు పూర్తయినట్లవుతుంది. దీంతో కేవలం డేటా ఎంట్రీగా కాకుండా ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి వస్తోంది.
వరికే ప్రాధాన్యమా?
రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో పంట సర్వేలో వరి వివరాల నమోదుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పత్తి, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాల నమోదులో మాత్రం జాప్యం జరుగుతోందని సమాచారం. ఒకే గ్రామంలో పలు రకాల పంటలు సాగు అవుతున్నప్పుడు ప్రతి పంట వివరాన్ని సమగ్రంగా నమోదు చేయాల్సి ఉంటుంది. వరి మినహా ఇతర పంటల వివరాలు వెనుకబడితే రాష్ట్రంలో వాస్తవ సాగు విస్తీర్ణానికి సంబంధించిన గణాంకాల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అన్ని పంటల నమోదును సమాన ప్రాధాన్యంతో చేపట్టాల్సిన అవసరం ఉంది.
సబ్‌డివిజన్ వారీగా మరో చిక్కు
సర్వే నంబర్ గుర్తించి పంటను నమోదు చేయడంతో ప్రక్రియ పూర్తికావడం లేదు. సర్వే నంబర్‌లో ఉన్న సబ్‌డివిజన్ల(అ, ఆ, ఈ, ఉ..)ను కూడా గుర్తించి వాటి వారీగా వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకే సర్వే నంబర్‌లో రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్‌డివిజన్లు ఉండటం, వాటిలో వేర్వేరు పంటలు సాగు చేయడం వంటి సందర్భాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు మరింత సమయం పడుతోంది.సబ్‌డివిజన్ వారీగా వివరాలు నమోదు చేయడంలో పొరపాటు జరిగితే భూమి విస్తీర్ణం, పంట రకం, సాగు విస్తీర్ణం వంటి వివరాల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉండటంతో సర్వేయర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. ఇది కూడా సర్వే నెమ్మదించడానికి కారణమవుతోంది.
థర్డ్‌పార్టీ సర్వేతోనే ఆలస్యమా?
పంట సర్వేలో థర్డ్‌పార్టీ సిబ్బందిని వినియోగించడం కూడా ప్రక్రియపై ప్రభావం చూపుతోందన్న చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో సర్వే బాధ్యతలు అప్పగించిన సిబ్బందికి యాప్ వినియోగం, సర్వే నంబర్ల గుర్తింపు, పంటల గుర్తింపు, సబ్‌డివిజన్ నమోదు వంటి అంశాలపై పూర్తి అవగాహన అవసరం. సమన్వయం లోపించినా, సాంకేతిక సమస్యలు ఎదురైనా సర్వే వేగం తగ్గే అవకాశం ఉంది.అయితే సర్వే ఆలస్యానికి థర్డ్‌పార్టీ విధానమే ప్రధాన కారణమా? లేక సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి నమోదు విధానం, సాంకేతిక సమస్యలు కూడా కారణమా? అన్నది అధికారులకే తెలియాలి.
కొరవడిన అధికారులపర్యవేక్షణ?
సర్వే పనులు జరుగుతున్న తీరును మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. ఏ గ్రామంలో ఎంత శాతం సర్వే పూర్తయింది? ఎన్ని సర్వే నంబర్లు పెండింగ్‌లో ఉన్నాయి? ఏ పంటల నమోదులో వెనుకబాటుతనం ఉంది? సబ్‌డివిజన్ వారీగా ఎక్కడ సమస్యలు ఉన్నాయి? అనే వివరాలను రోజువారీగా సమీక్షించాల్సి ఉంటుంది.కానీ క్షేత్రస్థాయిలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం యాప్‌లో నమోదైన సంఖ్యలను పరిశీలించడం కాకుండా.. వాస్తవంగా క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోందా? నమోదైన పంట వివరాలు సరైనవేనా? అన్నది తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా చర్యలుచేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
రైతులపై ప్రభావం
పంట సర్వే వివరాలు కేవలం ప్రభుత్వ గణాంకాల కోసమే కాకుండా వ్యవసాయ ప్రణాళిక, పంటల అంచనాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక అంశాలకు కీలకం. రైతు వాస్తవంగా సాగు చేసిన పంట సర్వేలో నమోదు కాకపోతే సంబంధిత రికార్డుల్లో వ్యత్యాసాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల సర్వేను త్వరగా పూర్తి చేయడమే కాకుండా, నమోదైన వివరాలు వాస్తవ సాగుకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికే ప్రభుత్వం యాప్ లో పంటలనమోదుతోనే కొనుగోలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తప్పవు.
ఎప్పటికి పూర్తయ్యేనో?
డెడ్‌లైన్ విధించినా సర్వే పూర్తికాకపోవడం.. గ్రామానికి ఒకరు, మేజర్ గ్రామానికి ఇద్దరే సర్వేయర్లు ఉండటం.. ప్రతి సర్వే నంబర్ వద్దకు వెళ్లి ఫొటో తీసి యాప్‌లో నమోదు చేయాల్సి రావడం.. ఇతర పంటల నమోదులో జాప్యం.. సబ్‌డివిజన్ వారీగా వివరాలు నమోదు చేయడం.. వీటన్నింటికీ తోడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం.. ఇలా కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట వివరాలను ఇకనైనా పెండింగ్ సర్వే నంబర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు సిబ్బందిని రంగంలోకి దించి, అన్ని పంటల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడతారా? లేదా? చూడాలి.
Also Read: హరీష్ రావు గారూ.. వారానికి ఒక తప్పు బయటపెడతా! భట్టి విక్రమార్క సంచలన సవాల్