ORR Closed: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు నగరం వరదలతో ముంచెత్తింది. ఎటు చూసినా వాన నీటితో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వానకు ప్రయాణికులు ఇంటికి చేరాలంటే రెండు గంటల పైగా సమయం పడుతోంది. దీంతో నగర ప్రజలు వర్షం అంటేనే భయాందోళన చెందుతున్నారు. ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రహదారుల్లో నీరు నిలిచి, గుంతలు ఏర్పడటంతో ఎటు నుంచి వెళ్లాలో దారి తెలియక ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉద్యోగులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించింది.
ఇక మరో వైపు, నిన్న కురిసిన భారీ వర్షాలకు నగర శివారులోని జంట జలాశయాలు నిండిపోతున్నాయి. హైదరాబాద్‌లోని శివారు టోల్ ఎగ్జిట్ నంబర్ 17 వద్ద ORR సర్వీస్ రోడ్డును హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరద భారీగా ముంచెత్తింది. దీంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా అటువైపు ప్రయాణికులు రాకుండా ఉండేందుకు ట్రాఫిక్ ORR ఎగ్జిట్ 17 వద్ద సర్వీస్ రోడ్డును బ్లాక్ చేశారు. అక్కనుంచి రాకపోకలు నిషేధించారు. ఎవరూ ఇటు వైపు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులు వేరే దారి నుంచి ప్రయాణించాలని సూచించారు. వాహనదారులు ఈ విషయం గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను వాడాలని పోలీసులు సూచిస్తున్నారు.
అంతేకాక, అక్కడ వరద ప్రమాదం కొనసాగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రాకూడదని అధికారులు తెలియజేశారు. సురక్షిత ప్రాంతాలకు త్వరగా చేరుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. పరిస్థితులు మరింత ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్, రహదారి భద్రతను నిర్వహిస్తూ సైబరాబాద్ పోలీసులు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల సహకారం, అప్రమత్తత చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు.