Hyderabad News: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారా? కంపెనీలు, షాపింగ్ మాల్స్ పెట్టే ఆఫర్లను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని పసిగట్టిన పోలీసులు సామాన్యులను ముందుగా హెచ్చరిస్తున్నారా? ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ ఖాతాలు ఖాళీ అని ఎందుకంటున్నారు? పోలీసులకు ఎలాంటి సమాచారం అందింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ట్రెండ్‌ని తమకు అనుకూలంగా మలచుకుంటారు సైబర్ నేరగాళ్లు. అందుకోసం వెయిట్ చేస్తారు. సెప్టెంబరు 22 నుంచి దసరా నవరాత్రులు మొదలుకానున్నాయి. అదే రోజు జీఎస్టీ కొత్త సంస్కరణలు అమలుకానున్నాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో వివిధ వస్తువుల కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తాయి. వాటిని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ఈ క్రమంలో అలర్టయిన హైదరాబాద్ పోలీసులు సామాన్యులను హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ఫేక్ లింక్స్‌ని సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు. వాటి విషయంలో జాగ్రత్త అంటూ అలర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్ల లింకులను క్లిక్ చేస్తే ఓ జేబు ఖాళీ అవ్వడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పండుగల షాపింగ్ వేళ జర జాగ్రత్త చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లతో ముప్పు పొంచి ఉందన్నారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట మోసాలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రకటనలు నమ్మే ముందు జాగ్రత్త అంటూ సూచనలు చేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రకటనలపై ఒక్కసారి ఆలోచించాలని చెబుతున్నారు.
ALSO READ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం.. టీ. కాంగ్రెస్ ఆగ్రహం
వాటి కింద ఫేక్ లింకులు పెడుతున్నారని, తక్కువ ధరకు వస్తాయని నమ్మి వాటికి క్లిక్ చేస్తే ఏటీఎం కార్డులు ఖాళీ అవ్వడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. వాటి విషయంలో వెబ్ సైట్ యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా అనుమానిత వెబ్ సైట్లలో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని చెప్పకనే చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లతో బిజీగా ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా చేతిలోవున్న ఫోన్ ద్వారా ఆఫర్లు వంటివి చెక్ చేసుకుంటున్నారు. రోజులో నాలుగైదు గంటలు యువత ఆన్‌లైన్‌లో గడుపుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని పసిగట్టిన పోలీసులు ఎప్పటికప్పుడు యువతీయువకులను హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్ అంటూ ఫేక్ లింక్స్ తో మీ ఖాతాలు ఖాళీ చేస్తారు జాగ్రత్త. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్ లింక్స్ ను ఓపెన్ చేయకండి. ఇలాంటి లింక్స్ ఫార్వర్డ్ చేయకండి.#telanganapolice pic.twitter.com/YtXvCnut9J
— Telangana Police (@TelanganaCOPs) September 8, 2025