Hyderabad City: నాకు జ్వరం వచ్చింది. కాస్త మందు త్రాగాను. సరే నేను త్రాగాను.. నేను త్రాగింది మీరు చూశారా.. ఔను 550 వచ్చింది.. అయితే ఏంటి? సార్ బైక్ నాది.. డబ్బులు నావి.. నేను త్రాగితే మీకేంటి సార్ ఇబ్బంది? నేను ఒప్పుకోను.. నాకు ఫైన్ వేయవద్దు. ఇది డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ పరిస్థితి. ఒక్కొక్క మాటకు, ఒక్కొక్క ప్రశ్నకు పోలీసులకు దిమ్మ తిరిగిందట. ఆ ప్రశ్నలు సంధించింది మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన వారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రవరించినా, పోలీసులు మాత్రం తమపని కానిచ్చేశారు.
హైదరాబాద్ పరిధిలోని అన్నీ కమీషనరేట్ల పరిధిలో పోలీసులు డిసెంబర్ 31 రాత్రి తమ ప్రతాపం చూపించారు. ముందుగానే పోలీసులు వార్తా పత్రికలు, సోషల్ మీడియా ద్వార పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా మద్యం త్రాగి వాహనాలు నడిపితే, చర్యలు తప్పవన్నారు. డ్రగ్స్ వంటి వాటి జోలికెళ్లినా కొరడా ఝుళిపిస్తామంటూ పోలీసులు సీరియస్ గా చెప్పారు. కానీ అసలే కొత్త ఏడాది రాబోతోంది. సందడి లేకుంటే ఎట్లా అనుకున్నారో ఏమో కానీ, 31 రాత్రి మద్యం త్రాగి బైక్స్, కార్లు నడుపుతూ వాహనదారులు వేలసంఖ్యలో పట్టుబడ్డారు.
ఈ సంధర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం పోలీసులకు చుక్కలు చూపించాయి. ఒక యువకుడిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అతనికి ఏకంగా 550 మీటర్ రీడింగ్ చూపింది. ఇంకాస్త త్రాగి ఉంటే చెక్ చేసే మిషన్ పేలేదని అక్కడి వాహనదారులు చర్చించుకోవడం విశేషం. అంతేకాదు మరొక బైకర్ అయితే విచిత్ర ప్రశ్నలు సంధించాడు పోలీసులకు. ఔను నేను త్రాగాను అయితే ఏంటి? జ్వరం వచ్చింది అందుకు త్రాగాను అనేసరికి ఆ పోలీసుల మోముపై చిరునవ్వులు చిందించాయి.
ఇంకొక యువకుడు అయితే ఏకంగా నన్ను మీరు బైక్ నడుపుతుంటే చూసినట్లు సాక్ష్యమెక్కడ అంటూ ప్రశ్నించాడు. ఇలా హైదరాబాద్ పోలీసులు మాత్రం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏమో కానీ, వారు టెస్ట్ రాసి పాసయ్యారని చెప్పవచ్చు. ఓపిక ప్రదర్శిస్తూ, మందు బాబులకు వారి తరహాలోనే సమాధానమిస్తూ, విధులు నిర్వర్తించారు. బాడీ కెమెరాలు ధరించిన పోలీసులు పెద్ద ఎత్తున ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. మద్యం త్రాగి వాహనం నడిపితే, ఎదురుగా వచ్చే వారికి ప్రమాదం పొంచి ఉంటుందన్న ఆలోచన లేకుండా, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో యువత పట్టుబడడం విశేషం.