Electric Auto Scheme: స్వేచ్ఛ బ్యూరో: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆటోరిక్షా డ్రైవర్లకు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నడుస్తున్న పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు ఈ పథకం కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
రాజీవ్ యువ వికాసం కింద ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం క్యూర్ పరిధిలో చెల్లుబాటు అయ్యే పర్మిట్లతో 18,766 పాత ఆటోలు నడుస్తున్నాయి. ఇందులో 11,254 డీజిల్ ఆటోలు, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి. వీటన్నింటినీ వంద శాతం పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. లబ్ధిదారులు తమ వీలును బట్టి కింది రెండు ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఆప్షన్ ఎ (రెట్రో-ఫిట్మెంట్): పాత ఆటో బాడీని అలాగే ఉంచి, దానికి ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకోవచ్చు. దీనికోసం రూ. 1,50,000 వరకు లేదా కిట్ యొక్క అసలు ధరలో ఏది తక్కువైతే అంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో ఫిక్స్‌డ్ లేదా స్వాపబుల్ (మార్చుకోగలిగే) బ్యాటరీలను ఎంచుకోవచ్చు.
Also read: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు!
పాత ఆటోను పూర్తిగా వదిలేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయాలనుకునే వారికి నేరుగా రూ. 1,50.000 ఫ్లాట్ సబ్సిడీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని షోరూమ్ ధరలోనే ముందస్తుగా తగ్గించి లబ్ధిదారునికి అందిస్తారు.
ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ సమానంగా లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వివిధ సంక్షేమ శాఖల నుండి నిధులను కింది విధంగా సర్దుబాటు చేశారు.షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి శాఖ: రూ. 50 కోట్లు,షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) అభివృద్ధి శాఖ: రూ. 50 కోట్లు, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ శాఖ: రూ. 50 కోట్లు, మైనారిటీల సంక్షేమ శాఖ: రూ. 50 కోట్లు కేటాయించారు. ఈ నిధులను రవాణా శాఖ కమిషనర్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. లబ్దిదారుల చేతికి ఇవ్వరు. నేరుగా కిట్ తయారిదారులేదా ఈవీ డీలర్ ఖాతాకు వెళ్తుంది. పెరుగుతున్న ఇంధన ధరల నుండి ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగించడంతో పాటు, నగరాల్లో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది.
Also read: నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!