Hyderabad Unemployment: ఐటీ హబ్‌గా, అంతర్జాతీయ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో ఒక మింగలేని నిజం వెలుగుచూసింది. నగరంలో నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోతోందని జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిరుద్యోగ రేటు 6.8 శాతానికి చేరుకుంది. అంటే నగరంలో ప్రతి 10 లక్షల మందిలో సుమారు 68 వేల మంది యువతీ యువకులు సరైన ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారు. దేశంలోని మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ నిరుద్యోగ పడగ నీడలు కాస్త ఎక్కువగా ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఇతర నగరాల సగటు కంటే ఎక్కువే.. ఎక్కడ తేడా కొడుతోంది?
సాధారణంగా దేశంలోని కోటి లేదా మిలియన్ జనాభా దాటిన నగరాల సగటు నిరుద్యోగ రేటు 4.9 శాతంగా ఉంది. కానీ భాగ్యనగరం ఆ సగటును దాటి చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఆర్థికంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న బెంగళూరు, సూరత్, హౌరా వంటి పారిశ్రామిక, ఐటీ నగరాలతో పోల్చి చూసినా కూడా హైదరాబాద్‌లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తేల్చింది. నిత్యం వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని భావిస్తున్న తరుణంలో, ఈ స్థాయి నిరుద్యోగిత నమోదు కావడం వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
మహిళల్లో మరింత తీవ్రం..
ఈ నివేదికలో అందరినీ అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న అంశం మహిళా నిరుద్యోగిత. నగరంలోని మొత్తం మహిళా శ్రామిక శక్తుల్లో నిరుద్యోగం ఏకంగా 9.1 శాతానికి చేరింది. చదువుకుని, నైపుణ్యాలు ఉండి కూడా చాలా మంది మహిళలకు వారి అర్హతకు తగ్గ అవకాశాలు లభించడం లేదు. లేదా కుటుంబ బాధ్యతలు, మారుతున్న కార్పొరేట్ పని గంటల వల్ల వారు ఉద్యోగ రంగంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం గురించి మాట్లాడుకుంటున్న వేళ, మహిళల్లో ఈ స్థాయి నిరుద్యోగిత ఉండటం ఆలోచించాల్సిన విషయమే.
అవకాశాల కొరతా.. యువత ఆలోచించాల్సిందే!
ఒకవైపు కంపెనీలు మాకు సరైన నైపుణ్యం (Skills) ఉన్న అభ్యర్థులు దొరకడం లేదని అంటుంటే, మరోవైపు డిగ్రీలు చేతిలో పట్టుకుని లక్షల మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న ‘నైపుణ్యాల అంతరాన్ని’ (Skill Gap) భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకడమిక్ చదువులతో పాటు నేటి మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కోడింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ టెక్నాలజీ వంటి కొత్త రంగాల్లో యువత పట్టు సాధించాలి. అప్పుడే ఈ 6.8 శాతం నిరుద్యోగ రేటును తగ్గించి, హైదరాబాద్‌ను నిజమైన ఉపాధి హబ్‌గా మార్చడం సాధ్యమవుతుంది.
Also Read: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి