Hyderabad: స్వేచ్ఛ బ్యూరో: ఓటరు జాబితాలోని లోపాలను సరి చేసి, బోగస్ ఓట్ల ఏరివేత కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) హైదరాబాద్ జిల్లాలో సవాలక్ష మధ్య తూతుమంత్రంగా కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, బూత్ లెవల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం ఓటర్ల పాలిట శాపంగా మారింది. గత నెల 25వ తేదీన మొదలైన ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 47 లక్షల 36 వేల 669 మంది ఓటర్లకు ఎనిమిది రోజుల్లోనే ఇంటింటికెళ్లి ఫారాలు పంపిణీ చేసి, వాటిని పూరించే విధానాన్ని వివరించి, తిరిగి సేకరించి ఈ నెల 24వ తేదీ లోపు తమకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, ఫారాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు.
పది రోజుల గడిచినా.. ఫారాలేవి..?
సర్ ప్రక్రియ ప్రారంభమైన శనివారం నాటికి పది రోజులు గడిచినా, ఇంకా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు ఫారాలేవీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు సర్ మొదలైన రోజున అసలు ఫారాల పంపిణీ చేయకపోగా, ఆ తర్వాత మూడు రోజుల పాటు కొందరు బూత్ లెవెల్ ఆఫీసర్లు అక్కడక్కడ కొంత మంది ఓటర్లకు మాత్రమే ఒకే ఎన్యుమరేషన్ ఫారాన్ని ఇచ్చి, దాన్ని జిరాక్స్ చేసుకోవాలని సూచించినట్లు కొందరు ఓటర్లు వాపోతున్నారు.
ఫారం జిరాక్స్ కాఫీల పంపిణీ
ఇదే విషయాన్ని జీహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ అధికారుల వద్ద ఆరా తీయగా, కొన్ని సమస్యల కారణంగా మూడు నియోజకవర్గాల్లో నేటికీ ఫారాల కొరత కొనసాగుతుందని అధికారులు పరోక్షంగా సంకేతాలిచ్చారు. మొత్తం 47 లక్షల 36 వేల 669 మంది ఓటర్లలో శనివారం సాయంత్రం వరకు దాదాపు 29 లక్షల మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిసింది. మిగిలిన 18 లక్షల మంది ఫారాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, పాతబస్తీలోని ఒక వర్గానికి చెందిన ఓటర్లు తమకు ఇంగ్లీష్ ఫారాలు కావాలని కొందరు బూత్ లెవెల్ ఆఫీసర్లను నిలదీసిన ఘటన జరగటంతో శనివారం పలు నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఫారం జిరాక్స్ కాపీలను పంపిణీ చేసినట్లు తెలిసింది.
Also Read: మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!
స్వీకరణకు ఎవరి డెడ్ లైన్లు వారివే
గత నెల 25న ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా మొదలైన నాటి నుంచి కేవలం ఏడు రోజుల్లో ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ తనకు కేటాయించిన ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్లకు ఫారాలు అందజేయాలంటూ ఆదేశాలున్నా, ప్రక్రియ మొదటి రోజుతో పాటు వరుసగా నాలుగు రోజుల పాటు కొన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయి విధులకు హాజరు కాలేదు. పైగా వేరే ఏరియాలో ఏమైనా ఇంటింటికి తిరుగుతున్నారేమోనంటూ ఓటర్లు వారిని వెతికిన సందర్భాలు సైతం ఉన్నాయి.
క్షేత్ర స్థాయి విధులకు ఆఫీసర్లు హాజరు
కొన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఫారాలు అందుబాటులో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయి విధులకు హాజరుకాకపోవటంతో ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు ఫారాలను పంపిణీ చేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు నిజాయితీగా ఇంటింటికి వెళ్తున్నా, అలాంటి వారికి ఫారాల కొరత వేధిస్తుంది. ఇలా సవాలక్ష సమస్యలతో సర్ ప్రక్రియ హైదారాబాద్ లో నామమాత్రంగా జరుగుతున్నట్లు విమర్శలున్నాయి.
ఎవరికీ వారే డెడ్ లైన్లు ఫిక్స్
ఫారాల పంపిణీలో ఆలస్యం కావటంతో కొందరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ నెల 5వ తేదీ కల్లా తమకు సమర్పించాలని, మరి కొందరు 7వ తేదీ, ఇంకొందరు 10వ తేదీన సమర్పించాలని బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరికి వారే డెడ్ లైన్లు ఫిక్స్ చేస్తున్నట్లు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో బతుకు దెరువు కోసం వచ్చిన వారు, 2002 తర్వాత పెళ్లయిన వారు తమ ఓటుకు సంబంధించి సర్ 2002 నాటి వివరాలు తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యామని, ఇంతలో ఫారం సమర్పణకు 5వ తేదీ, 7వ తేదీ చవరి తేదీ అని బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆందోళనకు గురి చేస్తున్నారని కొందరు నాంపల్లి నియోజకవర్గం ఓటర్లు వాపోతున్నారు.
Also Read: పదవులు ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గెలుపే నా లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి
అద్దె ఇంటి వారికి అదనపు బాధ్యత
హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు లేకుండా అద్దెకు ఉంటున్న ఓటర్లకు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలతో అదనపు బాధ్యత పెరిగే అవకాశముంది. అద్దెవాసులు ప్రస్తుతమున్న ఇంట్లో కాకుండా, ఇదివరకు వేరే ప్రాంతంలో నివసించి, అక్కడ ఓటు హక్కును వినియోగించుకుని ఉంటే, ఆ ఏరియా బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద ఫారం తీసుకుని, దాన్ని పూరించి, ఫొటో, డిక్లరేషన్లతో తిరిగి వారే స్వయంగా తీసుకువచ్చి బూత్ లెవెల్ ఆఫీసర్ కు సమర్పించాలని కొందరు ఎలక్షన్ వింగ్ అధికారులు సూచిస్తున్నట్లు ఓటర్లు వాపోతున్నారు.