Hyderabad News: హైదరాబాద్ సిటీలో అపార్టుమెంట్లు, ఇండువిడ్యువల్ ఇల్లు కోనుగోలుదారులను అలర్ట్ చేసింది హైడ్రా. అనుమతి లేనివి, అక్రమంగా కట్టినవాటిని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని సూచన చేసింది. తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేస్తే.. వాటిని కూల్చివేయాల్సి వస్తుందని చెప్పకనే చెప్పింది.
వర్షాకాలం మొదలు కావడంతో హైదరాబాద్ సిటీలో నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. నాలాలను ఆక్రమించి వాటిని సొంత స్థలంగా మార్చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిపై షాపులు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పూడుకుపోయిన చెత్త తొలగించడం సిబ్బందికి సాధ్యం కాలేదు.
దీనిపై మల్కాజిగిరి, బాచుపల్లి, పద్మారావునగర్, మాదాపూర్ ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలాంటి సమస్యలపై ప్రజావాణిలో 47 పిటిషన్లు వచ్చాయని హైడ్రా తెలిపింది. చాలా ప్రాంతాల్లో నాలాలు, పాత లేఅవుట్లపై ఆక్రమణలకు సంబంధించినవని ఉన్నాయని అధికారులు గుర్తించారు.
జూన్ 13న హైడ్రా ఆధ్వర్యంలో ప్రధాన మురికినీటి కాలువల నుండి చెత్త, ఆక్రమణలను తొలగించడం వంటి చర్యలను వేగవంతం చేసింది. పరిస్థితి గమనించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, సోమవారం ఆయా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.
ALSO READ: లండన్ కు కేటీఆర్.. పరారే పరారే!
ఈ క్రమంలో హైదరాబాద్ సిటీని ఆక్రమణల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందన్నారు. సిటీలో అపార్ట్‌మెంట్, ఇళ్ళు కొనుగోలు చేసే ముందు వాటి గురించి వివరాలను ధృవీకరించుకున్న తర్వాత కొనుగోలు చేయాలన్నారు. లేదంటే కూల్చివేత తప్పదని చెప్పకనే చెప్పింది.
సిటీలో అక్రమ నిర్మాణాలపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకునే లోపు అక్రమ నిర్మాణాలు పూర్తి చేస్తున్నారని జీహెచ్ఎంసీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. తొలుత నోటీసులు జారీ చేయడంతో అక్రమ నిర్మాణాలకు తాళం వేయాలని పేర్కొంది.
విచారణ తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని తేల్చిచెప్పింది. నోటీసు తర్వాత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని భయం వారిలో కనిపించలేదని తెలిపింది. కఠిన చర్యలతోనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆదేశించింది. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని తొలుత పరిశీలించాలి.
అనుమతులు లేకుండా నిర్మాణం జరిగితే, వాటిని ఎందుకు కూల్చకూడదో 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. నోటీసులు అందుకున్న తర్వాత పనులు జరిగితే ఆ భవనాన్ని సీజ్ చేయవచ్చు. సీజ్ చేసిన దానిపై అధికారి సంతకం కచ్చితంగా ఉండాలి. కమిషనర్ లేదా న్యాయస్థానం ఆదేశాలు లేకుండా వేసిన సీల్ తొలగించే అధికారం ఎవరికీ ఉండదు.