Mahesh Kumar Goud: మంత్రివర్గ విస్తరణ అంశంపై ఏఐసీసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంయుక్త నిర్ణయం అని రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణ, సొంత పదవులపై, రానున్న ఎన్నికలు, డీసీసీల ఎంపిక, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం, ఓట్ల చోరీ వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని.. రేవంత్ సీఎంగా, డిప్యూటీ సీఎం బట్టిగా, తాను పీసీసీగా ఉంటామని పేర్కొన్నారు.
తనకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని పత్రికల్లో వచ్చిన వార్తలను తాను విన్నానని.. చూశానని పేర్కొన్నారు. అయితే.. తాను పీసీసీ అధ్యక్షుడిగా సంతృప్తిగా ఉన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. సంస్థాగత వ్యవహారాల నుండి వచ్చాను కాబట్టి పీసీసీ పదవినే కోరుకుంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగానే కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనకు క్యాబినెట్‌పై కానీ.. పదవులపై కానీ ఎలాంటి ఆశలు, కోరికలు లేవని తేల్చి చెప్పారు. మంత్రివర్గం తన పరిధిలోని అంశం కాదని, దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఈ నెల 14న వస్తుందని, తాము గెలుస్తామనే హోప్‌తో ఉన్నామని గౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ నాయకులు ఒక ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లారని, వెల్ఫేయిర్ (సంక్షేమం) వర్కౌట్ అయిందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, యువత ఓటు వినియోగించుకోవడానికి ముందుకు రాలేదని, భవిష్యత్తులో ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు.
లోకల్ బాడీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత అధ్యయనం చేస్తామని, ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి ముందుకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడం ప్రయారిటీ అని అన్నారు. తాము డోర్ టు డోర్ తిరిగి కష్టపడ్డ కార్యకర్తలు ఇచ్చిన సమాచారాన్ని నమ్ముకున్నామని, మంచి మెజారిటీతో గెలుస్తున్నామని కార్యకర్తలు సమాచారం ఇచ్చారని తెలిపారు. రెండేళ్ల పరిపాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, తిరిగి మేమే ప్రభుత్వంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని.. రేవంత్ సీఎంగా, డిప్యూటీ సీఎం బట్టిగా, తాను పీసీసీగా ఉంటామని పేర్కొన్నారు.
ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ అతిగా మాట్లాడటం లేదని, గత ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బరాబర్ ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రెగ్గింగ్ (రిగ్గింగ్) అంటోందని.. అయితే ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డు లింక్ ఉండగా, ఫేక్ ఓట్లు ఎలా పోల్ అవుతాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారని గుర్తుచేశారు.
డీసీసీల (జిల్లా కాంగ్రెస్ కమిటీ) ఎంపిక కసరత్తు తుది దశకు చేరిందని, లిస్ట్ ఫైనల్ అయిందని, ఏఐసీసీ ఏ క్షణం అయినా ప్రకటించవచ్చని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ పదవులు ఆలస్యం అయ్యింది వాస్తవమేనని అంగీకరించారు. ఈ నెలల్లో పార్టీ పదవులకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు రెండు పదవులు వర్తించవు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన డీసీసీ పదవి ఇవ్వొద్దు అనడం కరెక్టు కాదని.. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి అయితే రెండు పదవులు ఉన్నట్టు కాదని వివరించారు.
బీసీ సీఎం అనేది కేవలం తన ఒక్కడి కోసం కాదని.. బీఆర్ఎస్ సోషల్ మీడియాపైనే ఆధారపడి ఉందని, అనైతికంగా సోషల్ మీడియాను వాడుతోందని విమర్శించారు. ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందని, దానిపై మాట్లాడడం కరెక్టు కాదని తెలిపారు.