తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : అప్పుల ఊబిలో చిక్కుకున్న జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు ఒక వైపు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు సర్కిల్ స్థాయి సిబ్బందిలో అదే అదునుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచే చేను మేసిన చందంగా సర్కిళ్లలో అధికారులు ట్రేడ్ లైసెన్స్‌ల వెరిఫికేషన్‌లో పలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన ట్రేడ్ లైసెన్సులను వెరిఫికేషన్ చేస్తే కొంత మేరకు ఆదాయం సమకూరుతుందని భావించి కమిషనర్ వెరిఫికేషన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు అవినీతి అధికారులకు వరంగా మారినట్లు కూడా విమర్శలున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్‌లో ఉన్న సుమారు రెండు లక్షల 49 వేల 522 ట్రేడ్ లైసెన్సులను మరోసారి సర్కిళ్ల వారీగా వెరిఫికేషన్ చేయాలని కమిషనర్ జారీ చేసిన ఆదేశాల మేరకు దాదాపు అన్ని సర్కిళ్లలో గడిచిన పదిహేను రోజులుగా వెరిఫికేషన్ కొనసాగుతుంది. అన్ని సర్కిళ్లలోనున్న ట్రేడ్ లైసెన్స్‌లలో అత్యధికంగా 34 వేల 137 ట్రేడ్ లైసెన్స్‌లు గోషామహాల్ సర్కిల్‌లో ఉండగా, అత్యల్పంగా చాంద్రాయణగుట్టలో 2451 ఉన్నట్లు సమాచారం. ఈ ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి కొనసాగుతున్న వ్యాపారాలు తీసుకున్న లైసెన్స్ ప్రకారమే కొనసాగుతున్నాయా? అదనంగా వ్యాపార లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా? అన్న కోణాల్లో ఈ వెరిఫికేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఏండ్ల కింద తీసుకున్న ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి కొనసాగుతున్న వ్యాపారాలు నేడు ఒకటి నుంచి రెండు, మూడు మలిగీలకు, అంతస్తులకు విస్తరించిన వాటిని తాజాగా అప్ డేట్ చేస్తే కొంత మేరకైనా బల్దియాకు లాభం చేకూరుతుందని అధికారులు భావించగా, స్వామి కార్యం స్వకార్యం అన్న చందంగా కొందరు అధికారులు సర్కిళ్లలో ట్రేడ్ లైసెన్స్‌ల దందాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తుల నుంచి బేరసారాలు కుదుర్చుకుని పాత లైసెన్సుల ఫీజులనే కొనసాగిస్తూ జీహెచ్ఎంసీ ఖజానాకు రావాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ప్రశ్నిస్తే..
ఏళ్ల క్రితం జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్‌లను ప్రస్తుత క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్ చేసేందుకు కొందరు కార్పొరేషన్ ఉద్యోగులు నిజాయితీగా విధులు నిర్వహిస్తుండటంతో.. కొందరు డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు అడ్డుపడుతున్నట్లు సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. వ్యాపారస్తుల నుంచి బేరసారాలు కుదుర్చుకుని పాత ట్రేడ్ లైసెన్స్ కొనసాగించేలా డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలో అధికారుల అవకతవకలను ప్రశ్నిస్తున్న శానిటరీ జవాన్, లైజనింగ్ ఆఫీసర్లకు కారణం లేకుండానే నోటీసులు జారీ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిణామాలు ఇటీవలే ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లలో చోటుచేసుకున్నట్లు వినికిడి. ఈ వ్యవహారంపై నోటీసులు స్వీకరించిన కొందరు ఉద్యోగులతో పాటు మరి కొందరు యూనియన్ నేతలు సంక్రాంతి పండుగ తర్వాత కమిషనర్ వద్ద పంచాయతీ పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది.
సర్కిళ్ల వారీగా ట్రేడ్ లైసెన్స్‌ల వివరాలు
సర్కిల్ ట్రేడ్ లైసెన్సుల సంఖ్య
———————————————————
కాప్రా – 7853
ఉప్పల్ – 5483
హయత్ నగర్ – 6773
ఎల్బీనగర్ – 6094
సరూర్ నగర్ – 6893
మలక్ పేట – 6572
సంతోష్ నగర్ – 3022
చాంద్రాయణగుట్ట – 2451
చార్మినార్ – 15313
ఫలక్ నుమా – 5171
రాజేంద్రనగర్ – 5477
మెహిదీపట్నం – 8492
కార్వాన్ – 4625
గోషామహాల్ – 34137
ముషీరాబాద్ – 6675
అంబర్‌పేట – 9750
ఖైరతాబాద్ – 14745
జూబ్లీహిల్స్ – 9815
యూసుఫ్‌గూడ – 3209
శేరిలింగంపల్లి – 17055
చందానగర్ – 7437
ఆర్సీపురం, పటాన్ చెరు – 2390
మూసాపేట – 7948
కూకట్‌పల్లి – 7349
కుత్బుల్లాపూర్ – 6653
గాజులరామారం – 4591
అల్వాల్ – 4903
మల్కాజిగిరి – 5549
సికింద్రాబాద్ – 2773
బేగంపేట – 20324
————————————————————-
మొత్తం – 249522
————————————————————-
Also Read: అలజడి రేపాలె!.. బద్నాం జేయాలె!!.. యాక్షన్ ప్లాన్‌లో కుట్ర సిద్ధాంత‘కారు’లు!