Paddy Smuggling: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. క్వింటాకు రూ.2389 ప్రభుత్వం మద్దతు ధర, బోనస్ సైతం చెల్లిస్తుండటంతో దీన్ని అదునుగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణకు వస్తుంది. కొంతమంది వ్యాపారులు, మధ్యవర్తులు నకిలీ పత్రాలను సృష్టిస్తూ ధాన్యం తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత రహదారుల నుంచి ధాన్యం తీసుకొస్తున్నారని సమాచారం. చెక్ పోస్టుల దగ్గర సైతం తనిఖీలు ముమ్మరం చేస్తారా? లేదా? అనే చర్చ ఊపందుకుంది.
అధికారుల నిర్లక్ష్యం రైతన్న పాలిట శాపంగా మారుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో యథేచ్ఛగా వస్తుంది. చెక్ పోస్టులు పెట్టి రాకుండా అడ్డుకుంటామని అధికారులు చేసిన ప్రకటనలు.. ఆ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టు లు ఏర్పాటు చేసి అక్రమంగా ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేస్తామని ప్రకటించినప్పటికీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం లోడుతో రాష్ట్రానికి వచ్చిన లారీలు పట్టుబడ్డాయి. ఇప్పటికే ఐదుపదుల సంఖ్యలో లారీలు వచ్చినట్లు సమాచారం.
రబీ సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అయితే క్వింటాకు సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర చెల్లిస్తుంది. అంతేకాదు సన్నాలకు రూ.2389 చెల్లించడంతో పాటు రూ.500 బోనస్ చెల్లిస్తుంది. దీంతో రాష్ట్రంలో మద్దతు ధర ఎక్కువగా ఉండటం, కొనుగోళ్లు సైతం వేగవంతం అవుతుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం ప్రతి ఏటా వస్తుంది. దీంతో ప్రభుత్వం టార్గెట్ కంప్లీట్ అవుతుండటంతో తెలంగాణ రైతాంగం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదుర్కుంటుంది. దీంతో ఈ సారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు.
Also read: తెలుగువారికి గుడ్ న్యూస్, విశాఖ నుంచి IRCTC ‘దివ్య దక్షిణ యాత్ర’!
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ వడ్ల రవాణా అరికట్టేందుకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 56 ఇంటర్-స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు చేస్తూ కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, పోలీసు శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. అయితే ఏపీ నుంచి ధాన్యం యథేచ్ఛగా వస్తుందనేది స్పష్టమవుతుంది. ధాన్యం లారీలపై ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నుంచి జోరుగా ధాన్యం తరలివస్తున్న వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 10న సూర్యాపేట, ఇతర జిల్లాల నుంచి ఆలగడప టోల్ గేట్ మీదుగా మిర్యాలగూడకు 50కి పైగా లారీల్లో ధాన్యం వచ్చినట్లు సమాచారంతో సివిల్ సప్లయి, పోలీసుశాఖ అధికారులు కొన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు. వేములపల్లి మండల పరిధిలోని ఓ రైస్ మిల్లుకు సుమారు 50కి పైగా లారీలు తరలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. టోల్ గేట్ దగ్గర పట్టుబడిన లారీలను వెంటనే వదిలిపెట్టడంతో విమర్శలకు దారితీస్తుంది.
Also Read: మరో సారి లీకుల బారిన పడ్డ రాజమౌళి సినిమా ‘వారణాసి’.. ఈ సారి యాక్షన్ వంతు..
కొంతమంది మిల్లర్లు సిండికెట్ గా మారడం, మధ్యవర్తులతో ఒప్పందం చేసుకొని నకిలీ పత్రాలతో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంజిల్లాలో అంతర్గత రోడ్ల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొస్తున్నట్లు సమాచారం. అదే విధంగా కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు చెందిన రైతుల ధాన్యాన్ని సైతం తెలంగాణకు తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్కడ క్వింటాకు 2100 కొనుగోలు చేసి తెలంగాణలో ఇస్తున్న 2389 మద్దతు ధరతో పాటు 500 బోనస్ వస్తుండటంతో ఇక్కడ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి కొంత మంది అధికారులు సైతం సహకారం అందిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
మరోవైపు రాష్ట్రంలో రావాణాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో 15 చెక్ పోస్టులు ఉండేవి. వాటిని తొలగించడం, సివిల్ సప్లయి అధికారులు సైతం ఏర్పాటు చేశామన్న ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల్లో సిబ్బంది పర్యవేక్షణ లోపించడం, కొన్ని చెక్ పోస్టుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతోనే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి సైతం ధాన్యం యధేచ్చగా వస్తున్నట్లు సమాచారం. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సైతం చోద్యం కారణంగా యథేచ్ఛగా ధాన్యం తెలంగాణకు వస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సివిల్ సప్లయి అధికారులు స్పందించి ఆదిలోనే చెక్ పోస్టుల వద్ద నిత్యం పర్యవేక్షణతో పాటు జిల్లా సరిహద్దుల్లోని అంతర్గత రహదారులపై సైతం నిఘా పెట్టి అక్రమంగా(అనుమతులు లేకుండా) ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేస్తారా? లేకుంటే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తారా? అనేది చూడాలి.
Also Read: కాశీలో సాధువుల ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు.. బాంబు పేల్చిన హీరో ఆర్య!