Instagram love caused suicide of young Woman: రోజురోజుకు కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్, షేర్ చాట్ వంటి సోషల్ మాధ్యమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా యువతీయువకులు ఇన్ స్టా పేరిట వీడియోలు, కామెడీ, రీల్స్ మోజులో పడి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇన్ స్టా.. ప్రేమకు దారితీయడం, తర్వాత బెడిసికొట్టడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన యువతిని యువకుడు ప్రేమ పేరుతో వేధించసాగాడు. ఈ ఘటనతో యువతి సూసైడ్ చేసుకోగా.. భయంతో ఆ యువకుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి(21)కి దోమడుగుకు చెందిన తేజస్విని(20) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. అయితే కొంత కాలం తర్వాత శ్రీహరి ఆ యువతిని వేధించసాగాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఈ వేధింపులు భరించలేక తేజస్విని ఈ నెల 8న తమ ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి అప్పటినుంచి భయపడుతూనే ఉన్నాడు. దీంతో భయంతో ఆ మరుసటిరోజే ఆగస్టు 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.
ఇదిలా ఉండగా.. జనరల్ వార్డులో ఉన్న శ్రీహరి.. మంచి నీరు తాగి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో వెతికిన కనిపించలేదు. అర్ధరాత్రి దాటినా శ్రీహరి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read: హైదరాబాదీలకు అలర్ట్.. నాలుగు రోజులు వర్షాలే
కాగా.. దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని బహదూర్‌పల్లిలోని ఓ సొసైటీలోని చెట్టుకు ఓ యువకుడు ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది శ్రీహరి అని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. యువతీయువకులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. కొంతమంది రీల్స్ పేరిట చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారని చెప్పారు. ఏదైనా పరిమితంగా వాడితేనే మంచిదని సూచించారు.